Jogi Ramesh: ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు: జోగి రమేశ్ అరెస్టుపై జగన్ స్పందన

YS Jagan Condemns Arrest of Jogi Ramesh Calls it Illegal
  • నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్ట్
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్
  • ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలకు పాల్పడుతున్నారంటూ విమర్శలు 
  • సిట్ విచారణ ఒక బూటకం అని ఆరోపణ
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధినేత జగన్ తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ అక్రమ అరెస్టు అని పేర్కొంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నకిలీ మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నిస్సిగ్గుగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

"చంద్రబాబు గారూ... మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేశ్ ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగి రమేశ్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. 

గత 18 నెలలుగా ప్రభుత్వం మీది, పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినవారే ఉన్నారు. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్‌ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్‌ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని. 

నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మొంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేశ్ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారూ.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. 

నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు గారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్‌ మీరు ఏం చెబితే అది చేస్తుంది. మీరు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం?" అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Jogi Ramesh
YS Jagan
Jagan Mohan Reddy
fake liquor case
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh politics
illegal arrest
CBI investigation
counterfeit alcohol

More Telugu News