Jogi Ramesh: జోగి రమేశ్ అరెస్ట్ పై వైసీపీ నేతల సంయుక్త ప్రకటన

Jogi Ramesh Arrested YSRCP Leaders Condemn Illegal Arrest
  • నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ అరెస్ట్
  • తీవ్రంగా స్పందించిన వైసీపీ అగ్రనేతలు
  • జోగి రమేశ్ ను దురుద్దేశంతో ఇరికించారని వారు ఆరోపణ
  • ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చడానికే అరెస్ట్ అని విమర్శలు
మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ అరెస్టుపై ఆ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ అని, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని మండిపడ్డారు. ఈ మేరకు వైసీపీ నేతలు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్ని నాని, అంబటి రాంబాబు, కురసాల కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్, టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

కల్తీ మద్యం కేసులో జోగి రమేశ్ ను దురుద్దేశంతో ఇరికించారని వారు ఆరోపించారు. కస్టడీలో ఉన్న ఏ-1 నిందితుడు జనార్దన్‌రావుతో బలవంతంగా జోగి రమేశ్ పేరు చెప్పించారని విమర్శించారు. ఈ ఆరోపణలపై జోగి రమేశ్ సవాల్ విసిరి, కనకదుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేసినా టీడీపీ నేతలు స్పందించలేదని గుర్తుచేశారు. వైసీపీని, జోగి రమేశ్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం తప్పుడు విచారణలు జరుపుతోందని, లేని లిక్కర్ స్కామ్‌లను సృష్టిస్తోందని వారు ఆరోపించారు.

రెండు కీలక ఘటనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ అరెస్టుల నాటకానికి తెరలేపిందని వైసీపీ నేతలు విమర్శించారు. కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట, మొంథా తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలను కప్పిపుచ్చడానికే ఈ అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తయారుచేస్తూ టీడీపీ నేతలు దొరికిపోతే, ఆ నెపాన్ని వైసీపీపైకి నెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు.

ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు జరపాలని జోగి రమేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అది విచారణకు రాకముందే ఆయన్ను అరెస్ట్ చేయడం ప్రభుత్వ దురుద్దేశానికి నిదర్శనమని అన్నారు. కల్తీ మద్యం కేసులో పక్కా ఆధారాలున్న టీడీపీ నాయకులను వదిలేసి, కేవలం కక్ష సాధింపు కోసం జోగి రమేశ్ ను అరెస్టు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఈ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని వైసీపీ నేతలు హెచ్చరించారు.
Jogi Ramesh
YSRCP
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics
Illegal Arrest
TDP
Chandrababu Naidu
Adulterated Liquor Case
Kanakadurga Temple
Political Vendetta

More Telugu News