Rajasekhar: హీరోగా 100 సినిమాలు.. ఇక ఏ పాత్ర అయినా చేస్తా: రాజశేఖర్

Rajasekhar After 100 Films Ready for Any Role
  • పని లేకపోతే జైల్లో ఉన్నట్లు ఉంటుందన్న రాజశేఖర్
  • 'బైకర్' స్క్రిప్ట్ బాగా నచ్చిందని వెల్లడి
  • తాను ఐబీఎస్ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడి
  • డిసెంబర్ 6న 'బైకర్' చిత్రం విడుదల
హీరోగా దాదాపు వంద చిత్రాలు పూర్తి చేశానని, ఇకపై ఎలాంటి పాత్ర వచ్చినా చేయాలని నిర్ణయించుకున్నట్లు సీనియర్ నటుడు రాజశేఖర్ తెలిపారు. తాజాగా రాజశేఖర్ తన కెరీర్, ఆరోగ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఖాళీగా ఉండటం అస్సలు నచ్చదని, పని లేకపోతే జైలులో ఉన్నట్లుగా అనిపిస్తుందని అన్నారు. శర్వానంద్ హీరోగా నటించిన ‘బైకర్‌’ సినిమా గ్లింప్స్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ చిత్రంలో రాజశేఖర్ ఓ కీలక పాత్ర పోషించారు.
 
ఈ సందర్భంగా ఆయన తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "గతంలో ఓ సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడి ఫొటోగ్రాఫర్ ఒకరు 'మీ చేతి నిండా పని ఉంది, మీరు చాలా లక్కీ' అన్నారు. ఆ రోజు ఆ మాటకు విలువ పెద్దగా అర్ధం కాలేదు. కానీ ఇప్పుడు దాని ప్రాముఖ్యత అర్థమవుతోంది. కరోనా సమయంలో నేను నడవలేని పరిస్థితికి వెళ్లాను. రెండు, మూడు నెలల్లో కోలుకున్నా, పని చేయాలనే తపన మాత్రం తగ్గలేదు," అని వివరించారు.
 
"చాలా కథలు విన్నాను, కానీ ఏవీ నచ్చలేదు. ఆ నిరాశలో ఉన్నప్పుడు దర్శకుడు అభిలాష్ ‘బైకర్‌’ కథతో నా దగ్గరకు వచ్చారు. ఈ స్క్రిప్ట్ నాకు ఎంతగానో నచ్చింది. ఓ నటుడిగా ప్రతిరోజూ సెట్ నుంచి ఎంతో సంతృప్తితో ఇంటికి వెళ్లేవాడిని," అని పేర్కొన్నారు. ఈ సినిమా గ్లింప్స్ ముందే చూసి ఉంటే, తానే హీరో పాత్రను అడిగేవాడినంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
 
ఇదే వేడుకలో తాను చాలాకాలంగా ఇరిటబుల్‌ బవల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నానని రాజశేఖర్ వెల్లడించారు. అందుకే వేదికపై మాట్లాడటానికి మొదట కాస్త ఇబ్బంది పడ్డానని అన్నారు. 
 
కాగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rajasekhar
Rajasekhar actor
Biker movie
Sharwanand
Malvika Nair
Abhilash Reddy director
Telugu cinema
Irritable bowel syndrome
IBS
Sports drama

More Telugu News