Nadendla Manohar: ఏపీలో ఈ నెల 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు... 48 గంటల్లోనే రైతులకు డబ్బులు: మంత్రి నాదెండ్ల

Nadendla Manohar Announces Paddy Procurement from Nov 3 in AP
  • నవంబరు 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు
  • వాట్సాప్ సందేశంతో సులభంగా రైతుల రిజిస్ట్రేషన్
  • ఈ ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం
  • ధాన్యం కొన్న 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు
  • రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకు పైగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
  • తాడేపల్లిగూడెంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి నాదెండ్ల
రాష్ట్రంలోని రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నవంబరు 3వ తేదీన ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.

ధాన్యం విక్రయించాలనుకునే రైతులు సులభంగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు ఈసారి వాట్సాప్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు. రైతులు తమ ఫోన్ నుంచి 7337359375 అనే వాట్సాప్ నంబర్‌కు “HI” అని సందేశం పంపడం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని సూచించారు.

ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశామని చెప్పారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో సుమారు 10,700 మంది సిబ్బంది పాల్గొంటారని, రైతుల నుంచి ధాన్యం సేకరించిన 24 నుంచి 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు.

గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. "నాణ్యమైన గోనె సంచులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. తేమ శాతాన్ని నిర్ధారించే యంత్రాలు, రవాణా సౌకర్యాల విషయంలో సమస్యలు రాకుండా చూడాలి" అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

నవంబర్ 3వ తేదీ సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఆరుగొలను గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
Nadendla Manohar
AP Paddy Procurement
Andhra Pradesh
Kharif Season 2025-26
Paddy Purchase
Farmer Registration
Whatsapp Registration
Rice Procurement
West Godavari
Tadepalligudem

More Telugu News