APSDMA: ఏపీలో రేపు వర్షాలు: ఏపీఎస్డీఎంఏ అలర్ట్

APSDMA alerts for rains in Andhra Pradesh
  • ఏపీలోని నాలుగు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్ష సూచన
  • మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం
  • ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న కృష్ణా వరద ప్రవాహం
  • బ్యారేజీ వద్ద 1.67 లక్షల క్యూసెక్కులుగా ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో
  • నదీ పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • చెట్ల కింద నిలబడవద్దని విపత్తుల సంస్థ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఆదివారం (నవంబర్ 2) పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోందని ప్రఖర్ జైన్ తెలిపారు. వరద ఉద్ధృతిలో రానున్న కొన్ని రోజులు హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందన్నారు. శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీ వద్ద 1,67,175 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో నమోదైనట్లు వివరించారు.

ఈ నేపథ్యంలో కృష్ణా నది పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
APSDMA
Andhra Pradesh rains
AP weather forecast
heavy rainfall warning
Prachar Jain
Krishna river floods
Bapatla
Palnadu
Prakasam
Nellore

More Telugu News