Kasibugga: కాశీబుగ్గ ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన

AP Government Responds to Kasibugga Tragedy
  • ఘటనలో 9 మంది భక్తులు మృతి, 13 మందికి గాయాలు
  • మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం
  • గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున చికిత్స ఖర్చులు
  • ఘటనపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణకు ఆదేశం
  • భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 9 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.

శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని.... దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారని తెలిపింది.

ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని, గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

కాగా, ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఆలయాల్లో భద్రతా ఏర్పాట్లు, భక్తుల రద్దీ నియంత్రణపై ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషాద ఘటనతో కాశీబుగ్గ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Kasibugga
Andhra Pradesh government
Kasibugga stampede
Srikakulam district
Venkateswara Swamy Temple
Palasa government hospital
Andhra Pradesh news
Ekadasi festival
Temple safety
AP government

More Telugu News