Aruna Nellore: నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్

Nellore Lady Don Aruna Gets 14 Day Remand
  • లేడీ డాన్‌గా పేరున్న అరుణకు విజయవాడ కోర్టు రిమాండ్
  • ఉద్యోగాల పేరుతో రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేసినట్టు ఆరోపణ
  • డబ్బు తిరిగివ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడినట్టు బాధితుడి ఫిర్యాదు
లేడీ డాన్‌గా పేరు పొందిన నెల్లూరుకు చెందిన అరుణకు విజయవాడ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఉద్యోగాల పేరుతో రూ. 12 లక్షలు తీసుకుని మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం నవంబరు 14 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే, 2021లో రమేశ్ బాబు అనే వ్యక్తి తన బంధువులకు ఉద్యోగాలు ఇప్పించాలంటూ అరుణను సంప్రదించారు. ఇందుకు గాను ఆమెకు రూ. 12 లక్షల వరకు నగదు ముట్టజెప్పారు. అయితే, నెలలు గడుస్తున్నా ఉద్యోగాల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన రమేశ్ బాబు.. అరుణను కలిసి తన డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీశారు.

ఈ క్రమంలో అరుణ తనను నెల్లూరుకు పిలిపించి తీవ్రంగా బెదిరించారని, దాంతో భయపడి ఇన్నాళ్లూ ఫిర్యాదు చేయలేదని బాధితుడు తెలిపారు. ఇటీవల ధైర్యం చేసి విజయవాడ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించి, తాను మోసపోయిన తీరును వివరిస్తూ ఫిర్యాదు చేశారు.

రమేశ్ బాబు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరుణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే మరో కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న అరుణను, పీటీ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. స్థానిక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు నిందితురాలిని తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు. 
Aruna Nellore
Nellore Lady Don
Vijayawada Court
Job Fraud Case
Remand
Ramesh Babu
Suryaraopet Police
Nellore Jail

More Telugu News