Chiranjeevi: చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేశాం: డీసీపీ కవిత

Chiranjeevi files complaint two cases registered says DCP Kavitha
  • చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో డీప్‌ఫేక్‌ వీడియోలు
  • మెగాస్టార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు
  • సోషల్ మీడియాలో 25కు పైగా పోస్టులను గుర్తించి దర్యాప్తు
సోషల్ మీడియాలో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని కొందరు ఆకతాయిలు అసభ్యకర పోస్టులు, డీప్‌ఫేక్‌ వీడియోలను వైరల్ చేస్తున్న వ్యవహారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనపై చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే గుర్తిస్తామని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడించారు.

మీడియాతో మాట్లాడిన డీసీపీ కవిత, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాలో, ముఖ్యంగా 'ఎక్స్' (ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో 25కు పైగా అభ్యంతరకర పోస్టులను గుర్తించామని, వాటిపై విచారణ కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. ఈ కేసులో చిరంజీవి కేవలం క్రిమినల్ ఫిర్యాదుకే పరిమితం కాలేదని, సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారని డీసీపీ వివరించారు. ఆయన ఇచ్చిన క్రిమినల్ కంప్లైంట్ ఆధారంగా తాము కేసులు నమోదు చేశామన్నారు.

డీప్‌ఫేక్‌ టెక్నాలజీని కొందరు దుర్వినియోగం చేస్తూ మోసం, బ్లాక్‌మెయిల్ వంటి నేరాలకు పాల్పడుతున్నారని ఆమె హెచ్చరించారు. "డీప్‌ఫేక్‌ ఘటనలు చిన్నవి కావు. వీటిని అస్సలు ఉపేక్షించబోం. ఇప్పటికే కేసులు నమోదు చేసి నోడల్ ఏజెన్సీకి వివరాలు పంపించాం" అని ఆమె గట్టిగా హెచ్చరించారు.

సైబర్ నేరాల బాధితులు ఎవరైనా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా నేరుగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని ఆమె ప్రజలకు సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి నకిలీ వీడియోలను ఎవరూ షేర్ చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
Chiranjeevi
Chiranjeevi deepfake
Hyderabad cyber crime
DCP Kavitha
cyber crime investigation
social media abuse
deepfake technology
cyber crime helpline 1930
fake videos

More Telugu News