Jubilee Hills Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో దినసరి కూలీలు, విద్యార్థులు.. రోజుకు ఎంతంటే..!

Jubilee Hills Election Daily Wage Earners and Students Earn Big in Campaign
  • జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో ఖాళీగా మారిన కార్మిక అడ్డాలు
  • ప్రచారానికి వెళ్తే కూలీలకు రోజుకు రూ.400 నుంచి రూ.600 వరకు చెల్లింపు
  • డబ్బుతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్న పార్టీలు
  • ఓటర్ల సర్వే కోసం విద్యార్థులకు రోజుకు రూ.1000 ఆఫర్
  • ప్రచార కార్యక్రమాల్లో జూనియర్ ఆర్టిస్టులు
  • జన సమీకరణ కోసం పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్న వైనం
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నికల ప్రచార హోరు దినసరి కూలీలకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకే కార్మికులతో కిటకిటలాడే కృష్ణానగర్‌, రహ్మత్‌నగర్‌, బోరబండ, శ్రీనగర్‌ కాలనీ వంటి ప్రాంతాల్లోని కూలీ అడ్డాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పని కోసం ఎదురుచూసే బదులు, వారంతా రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉపాధి పొందుతున్నారు.

నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో ప్రధాన రాజకీయ పార్టీలు రోజుకు పదికి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థులు, ముఖ్య నేతల వెంట కనీసం 100 మంది జనం ఉండేలా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ జనసమీకరణలో పార్టీ కార్యకర్తలతో పాటు అత్యధిక సంఖ్యలో దినసరి కూలీలనే వినియోగిస్తున్నారు. పార్టీ జెండాలు మోయడం, పోస్టర్లు అంటించడం వంటి పనులకు వీరిని నియమించుకుంటున్నారు.

భోజనంతో పాటు ఆకర్షణీయమైన కూలీ
రెండు పూటలా ప్రచారంలో పాల్గొన్న కూలీలకు పార్టీలు రోజుకు రూ.400 నుంచి రూ.600 వరకు చెల్లిస్తున్నాయి. మధ్యాహ్నం భోజనం సదుపాయం అదనం. ఒక పార్టీ అభ్యర్థి అయితే రోజుకు రూ. 800 వరకు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో స్థానిక కూలీలే కాకుండా, ఇందిరానగర్‌లోని జూనియర్ ఆర్టిస్టులు సైతం షూటింగ్‌లు లేనప్పుడు ప్రచారానికి వస్తున్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలను ప్రచారానికి తరలిస్తున్నారు.

ఓటర్ల సర్వేకు విద్యార్థుల వినియోగం
కేవలం కూలీలే కాదు, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ ఎన్నికల వల్ల గిరాకీ పెరిగింది. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలను విద్యార్థులకు అప్పగించి, ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. ఓటర్లు నిర్దేశిత చిరునామాలో ఉన్నారా? లేదా? అని నిర్ధారించుకుని, వారి ఫోన్ నంబర్లను సేకరించడమే వీరి పని. ఈ పనికి గాను విద్యార్థులకు రోజుకు ఏకంగా రూ.1000 వరకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు సేకరించిన డేటా ఆధారంగా పార్టీలు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్, వాట్సాప్ సందేశాలు పంపడంతో పాటు, టెలీ కాలర్లతో ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
Jubilee Hills Election
Telangana Elections
Daily Wage Earners
Student Workers
Election Campaign
Voter Survey
Hyderabad Politics
Telangana Politics
Krishna Nagar
Rahmath Nagar

More Telugu News