Rohit Arya: ముంబైలో పట్టపగలే స్టూడియోలో 20 మంది చిన్నారులను బంధించిన వ్యక్తి

Rohit Arya Held 20 Children Hostage in Mumbai Studio
  • ఆర్ఏ స్టూడియోలో ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను బంధించిన వ్యక్తి
  • కాపాడాలంటూ కేకలు వేసిన చిన్నారులు
  • స్థానికులు సమాచారం అందించడంతో కాపాడిన పోలీసులు
ముంబైలోని పవయి ప్రాంతంలోని ఆర్ఏ స్టూడియోలో ఒక వ్యక్తి పట్టపగలు సుమారు 20 మంది చిన్నారులను బంధించి బెదిరింపులకు పాల్పడిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆడిషన్స్ కోసం వచ్చిన చిన్నారులను స్టూడియోలో పనిచేస్తున్న ఒక వ్యక్తి బంధించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి చిన్నారులను రక్షించారు.

ఆర్ఏ స్టూడియోలో పనిచేసే రోహిత్ ఆర్య గత నాలుగైదు రోజులుగా ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం 15 ఏళ్ల లోపు వయస్సున్న దాదాపు వంద మంది పిల్లలు ఆడిషన్స్ కోసం వచ్చారు. వారిలో 80 మంది చిన్నారులను స్టూడియో నుంచి బయటకు పంపిన రోహిత్ ఆర్య, మిగిలిన 20 మందిని స్టూడియోలోనే బంధించాడు. భయంతో ఆందోళన చెందిన పిల్లలు స్టూడియో కిటికీల నుంచి సాయం కోసం కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అదే సమయంలో, రోహిత్ ఆర్య ఒక వీడియోను విడుదల చేశాడు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి బదులు మరో ప్రణాళిక ఆలోచించానని, అందుకే ఈ చిన్నారులందరినీ బంధించానని పేర్కొన్నాడు. తాను ఉగ్రవాదిని కాదని, డబ్బులు కూడా అవసరం లేదని స్పష్టం చేశాడు. అయితే కొంతమందితో మాట్లాడి, వారి నుంచి సమాధానాలు తెలుసుకోవాలని చెప్పాడు. ఈ సమయంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బందీలుగా ఉన్న చిన్నారులను సురక్షితంగా విడిపించారు.
Rohit Arya
Mumbai
RA Studio
Children Hostage
Powai
Auditions
Child Safety
Mumbai Police

More Telugu News