Nitin Gadkari: తిట్లు నా ఒక్కడికేనా?.. నితిన్ గడ్కరీ

QR code system for road transparency says Nitin Gadkari
  • దేశంలోని ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్‌ల ఏర్పాటు
  • పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకే ఈ చర్యలు
  • స్కాన్ చేస్తే కాంట్రాక్టర్, బడ్జెట్, గడువు వివరాలు వెల్లడి
  • రోడ్లు బాగోకపోతే తిట్లన్నీ నాకేనా అంటూ గడ్కరీ వ్యాఖ్య
  • సమస్య ఉంటే నేరుగా అధికారులను ప్రశ్నించే అవకాశం వుందని వివరణ 
  • రోడ్ల పనుల్లో అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యమని వెల్లడి 
దేశంలో రోడ్ల నిర్మాణంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన రహదారులపై క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. ఈ విధానం ద్వారా రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చని ఆయన తెలిపారు.

డిల్లీలో జరిగిన 'స్మార్ట్ రోడ్ల భద్రత' అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో గడ్కరీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘రోడ్లు సరిగా లేకపోతే అందరూ నన్నే నిందిస్తున్నారు. మొత్తం వ్యవస్థ చేసిన తప్పునకు నేను ఒక్కడినే ఎందుకు తిట్లు తినాలి? సోషల్ మీడియాలో వచ్చే ఆరోపణలకు ఎందుకు స్పందించాలి?’’ అంటూ ప్రశ్నించారు. ఈ సమస్యకు పరిష్కారంగానే రోడ్లపై క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసినట్లు వివరించారు.

ఈ క్యూఆర్ కోడ్‌ను పౌరులు తమ ఫోన్‌తో స్కాన్ చేస్తే చాలు.. ఆ రహదారి నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. ప్రాజెక్టును చేపట్టిన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, నిర్మాణానికి మంజూరైన బడ్జెట్, పూర్తి చేయాల్సిన గడువు, నిర్వహణ బాధ్యతలు వంటి కీలక సమాచారం అందులో ఉంటుంది. అంతేకాదు, సంబంధిత అధికారుల ఫొటోలు, ఫోన్ నంబర్లు సహా వివరాలు ఉంటాయని గడ్కరీ స్పష్టం చేశారు.

ఈ విధానం వల్ల ఏదైనా రోడ్డు నాణ్యత సరిగా లేకపోయినా, గుంతలు పడినా ప్రజలు నేరుగా సంబంధిత కాంట్రాక్టర్ లేదా అధికారిని ప్రశ్నించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. రోడ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడే అధికారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ఇది వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచుతుందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.
Nitin Gadkari
Road construction India
QR code roads
Road safety India
Highway projects India
Infrastructure development
Road quality control
Corruption roads
Ministry of Road Transport and Highways
Smart roads

More Telugu News