Hussain Sayyad: మహారాష్ట్రలో మంటల్లో కాలిపోయిన బస్సు.. ప్రయాణికులను కాపాడిన డ్రైవర్

Driver saves passengers from burning bus on Samruddhi Highway
  • సమృద్ధి హైవేపై ప్రైవేట్ లగ్జరీ బస్సులో అగ్నిప్రమాదం
  • మంటల్లో పూర్తిగా దగ్ధమైన బస్సు
  • సమయస్పూర్తితో వ్యవహరించిన డ్రైవర్  
  • నాగ్‌పూర్ లేన్‌పై నిలిచిపోయిన ట్రాఫిక్
మహారాష్ట్రలోని సమృద్ధి హైవేపై పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ లగ్జరీ బస్సులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. అయితే, డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడారు.

ముంబై నుంచి జాల్నాకు వెళ్తున్న ఈ బస్సులో డ్రైవర్, అసిస్టెంట్‌తో పాటు 12 మంది ప్రయాణికులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాగ్‌పూర్ లేన్‌పై వెళ్తుండగా బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన డ్రైవర్ హుస్సేన్ సయ్యద్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులందరినీ కిందకు దించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, హైవే పోలీసులు, టోల్ ప్లాజా అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటన కారణంగా నాగ్‌పూర్ లేన్‌పై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇటీవలి కాలంలో హైవేలపై బస్సులు దగ్ధమవుతున్న ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వద్ద ద్విచక్ర వాహనం ఢీకొని బస్సులో మంటలు చెలరేగిన దుర్ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. అలాగే, గత ఆదివారం ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్, కండక్టర్ 70 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. తాజా ఘటనతో ఇలాంటి ప్రమాదాలపై మళ్లీ చర్చ మొదలైంది.
Hussain Sayyad
Maharashtra bus fire
Samruddhi Highway accident
bus accident
Nagpur lane fire
Mumbai Jalna bus
road accident
bus driver saves passengers
fire accident
highway safety

More Telugu News