KL Rahul: కెవిన్ పీటర్సన్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని అతడి భార్యకు సరదాగా ఫిర్యాదు చేశా: కే.ఎల్. రాహుల్

KL Rahul Complained to Kevin Pietersens Wife About His Behavior
  • యూకే వెళ్లినప్పుడు పీటర్సన్‌పై అతడి భార్యకు ఫిర్యాదు చేశానన్న రాహుల్
  • మీ భర్తను నాతో సౌమ్యంగా ఉండమని చెప్పండని సరదాగా ఫిర్యాదు చేశానన్న రాహుల్
  • పీటర్సన్, తన మధ్య జరిగే చాలా సంభాషణలు బయటకు రావన్న కే.ఎల్. రాహుల్
కెవిన్ పీటర్సన్ తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని, కాస్త సౌమ్యంగా ఉండమని చెప్పమని అతడి భార్య జెస్సికాకు సరదాగా ఫిర్యాదు చేశానని టీమిండియా క్రికెటర్ కే.ఎల్. రాహుల్ అన్నాడు. రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథిగా ఉండగా, పీటర్సన్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కెవిన్ పీటర్సన్, కే.ఎల్. రాహుల్ మైదానంలో, బయట ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటారు.

ఒక యూట్యూబ్ ఛానల్ పాడ్‌కాస్ట్‌లో కే.ఎల్. రాహుల్ మాట్లాడుతూ, పీటర్సన్, తన మధ్య జరిగే ఆసక్తికర సంభాషణల గురించి పంచుకున్నాడు. తమ మధ్య ఎన్నో ఆసక్తికర వాదనలు జరుగుతుంటాయని, తమ కొన్ని సంభాషణలను ఢిల్లీ జట్టు సామాజిక మాధ్యమ బృందం రెండు, మూడుసార్లు ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేసిందని గుర్తు చేసుకున్నాడు.

వాటిని తన భార్య అతియా శెట్టి చూసి, కెవిన్ పీటర్సన్ చాలా మంచి వ్యక్తి అని, అతనితో అంత కఠినంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావని అడిగిందని చెప్పాడు. వాస్తవానికి తాను, పీటర్సన్ మాట్లాడుకునే చాలా సంభాషణలు అన్నీ బయటకు రావని చెప్పాడు. బయటకు వచ్చేవి కొన్ని మాత్రమేనని అన్నాడు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్ పర్యటనలో పీటర్సన్, అతని భార్య జెస్సికాతో ఒక విందులో పాల్గొన్నానని, ఆ సమయంలో పీటర్సన్‌పై సరదాగా ఫిర్యాదు చేశానని చెప్పాడు. "నేను యూకేలో ఉన్నప్పుడు పీటర్సన్‌పై అతడి భార్యకు ఫిర్యాదు చేశాను. వారు నన్ను విందుకు ఆహ్వానించిన సమయంలో, 'నాతో కాస్త సౌమ్యంగా ఉండమని మీ భర్తకు చెప్పండి. నాతో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు' అని ఫిర్యాదు చేశాను" అని చెప్పాడు.
KL Rahul
Kevin Pietersen
Jessica Pietersen
Team India
Delhi Capitals
cricket

More Telugu News