Pawan Kalyan: 'మొంథా' తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Pawan Kalyan Reviews Cyclone Montha Situation in Andhra Pradesh
  • ప్రభావిత జిల్లాల కలెక్టర్ల నుంచి వివరాల సేకరణ
  • విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశం
  • పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి వసతి, ఆహారం కొనసాగించాలని సూచన
  • నదుల ఉద్ధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలన్న ప‌వ‌న్‌
  • వర్షాల తర్వాత పారిశుద్ధ్యం, తాగునీటిపై దృష్టి పెట్టాలని ఆదేశాలు
మొంథా తుపాను ఏపీని వణికిస్తోంది. తుపాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, ప్రజలకు అండగా నిలవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

తుపాను పరిస్థితులపై పవన్ తన కార్యాలయ అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లతో ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు మాట్లాడారు. ఈదురు గాలులు, కుండపోత వర్షాల కారణంగా జరిగిన నష్టంపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి విద్యుత్ తీగలపై పడటం, స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్, విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. తుపాను బలహీనపడినా భారీ వర్షాలు కొనసాగుతున్నందున, ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోనే ఉంచాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి, వారికి ఆహారం, వసతి కల్పించాలని స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నా నదితో పాటు పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని పవన్ సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని, ప్రజలకు సురక్షితమైన తాగునీటిని సరఫరా చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Pawan Kalyan
Andhra Pradesh
Cyclone Montha
AP Floods
Deputy CM
Heavy Rains
Relief Measures
Cyclone Relief
Pawan Kalyan Review
AP Government

More Telugu News