RBI: ఆర్‌బీఐ వ్యూహాత్మక అడుగు.. భారత్‌కు 274 టన్నుల పసిడి నిల్వలు

RBI Transfers 274 Tonnes of Gold Reserves to India
  • స్వదేశీ ఖజానాల్లోనే అధిక నిల్వలకు ఆర్‌బీఐ ప్రాధాన్యం
  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక నిర్ణయం
  • ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో 64 టన్నుల పసిడి తరలింపు
  • భారత్‌లోనూ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
  • అమెరికా ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న మార్కెట్లు
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తన బంగారు నిల్వలను భారీగా స్వదేశానికి తరలిస్తోంది. విదేశీ ఖజానాల్లో దాచిన పసిడిని తిరిగి భారత్‌కు తీసుకురావడంపై దృష్టి సారించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల నుంచి తమ ఆస్తులను కాపాడుకునేందుకే ఆర్‌బీఐ ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.

అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఆర్‌బీఐ సుమారు 64 టన్నుల బంగారాన్ని భారత్‌కు తరలించింది. సెప్టెంబర్ చివరి నాటికి భారత్ వద్ద మొత్తం 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉండగా, అందులో 575.8 టన్నులు ఇప్పుడు దేశీయ ఖజానాల్లోనే భద్రంగా ఉన్నాయి. మిగిలిన 290.3 టన్నుల పసిడిని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ (BIS) వద్ద ఉంచారు. మరో 14 టన్నులు గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌లలో ఉన్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆఫ్ఘ‌నిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత జీ7 దేశాలు ఆయా దేశాల విదేశీ మారక నిల్వలను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత 2023 మార్చి నుంచి ఆర్‌బీఐ విదేశాల నుంచి ఏకంగా 274 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. విదేశాల్లోని ఆస్తుల భద్రతపై ఆందోళనల కారణంగానే ఆర్‌బీఐ ఈ చర్యలు చేపట్టింది.

ఇదిలాఉంటే.. ఈరోజు భారత మార్కెట్లలో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు పెరగడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర ఫ్లాట్‌గా రూ.1,19,647 వద్ద ప్రారంభమై, ఆ తర్వాత 0.34 శాతం (రూ.401) పెరిగి రూ.1,20,047 వద్ద ట్రేడ్ అయింది. వెండి ధర కూడా కిలోకు 0.69 శాతం (రూ.989) పెరిగి రూ.1,45,331కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుపై 0.2 శాతం పెరిగి 3,957.42 డాలర్ల వద్ద ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 52 శాతం పెరిగాయి. అక్టోబర్ 20న ఔన్సుకు 4,381.21 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితి, వడ్డీ రేట్ల కోతపై అంచనాలు, ఆర్‌బీఐ వంటి కేంద్ర బ్యాంకులు కొనుగోళ్లు కొనసాగించడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
RBI
Reserve Bank of India
Gold Reserves
India Gold
Gold Price
Indian Economy
Bank of England
BIS
Geopolitical Tensions
Gold Investment

More Telugu News