Sajjanar: డీప్‌ఫేక్ మోసాలకు 'సేఫ్ వర్డ్'.. సజ్జనార్ కీలక సూచన

Sajjanar Suggests Safe Word for Deepfake Frauds
  • డీప్‌ఫేక్ మోసాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక
  • గొంతు, ముఖం మార్చి డబ్బులు డిమాండ్ చేస్తున్న కేటుగాళ్లు
  • కుటుంబ సభ్యులతో 'సేఫ్ వర్డ్' ఏర్పాటు చేసుకోవాలని సూచన
  • సందేహాస్పద కాల్స్ వస్తే రహస్య పదం అడగాలని వెల్లడి
  • మోసాలు గుర్తిస్తే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి
టెక్నాలజీ సాయంతో విస్తరిస్తున్న డీప్‌ఫేక్ మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి మనకు తెలిసిన వారి ముఖం, గొంతును సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు 'సేఫ్ వర్డ్' (రహస్య పదం) ఒకటే సురక్షితమైన మార్గమని ఆయన సూచించారు. 

మోసం చేసే విధానం ఇదే
సైబర్ నేరగాళ్లు మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల ముఖం, గొంతును ఏఐ టెక్నాలజీతో క్లోన్ చేస్తున్నారు. ఆ తర్వాత మనకు వీడియో లేదా ఆడియో కాల్ చేసి, తాము ఏదో అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నామని నమ్మించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అచ్చం మనకు తెలిసిన వారిలాగే మాట్లాడటంతో చాలామంది సులభంగా మోసపోతున్నారు. ఈ తరహా మోసాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయని, ఈ ఏడాది చివరి నాటికి వీటి వల్ల సుమారు రూ.70,000 కోట్ల నష్టం వాటిల్లవచ్చని 'పై-ల్యాబ్స్' నివేదిక అంచనా వేసినట్లు సజ్జనార్  పేర్కొన్నారు.

'సేఫ్ వర్డ్' ఎలా పనిచేస్తుంది?
ఈ డీప్‌ఫేక్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ముందుగానే ఒక 'సేఫ్ వర్డ్' లేదా రహస్య కోడ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు తెలిసిన వారి నంబర్ నుంచి గానీ, కొత్త నంబర్ నుంచి గానీ కాల్ వచ్చి డబ్బు అడిగితే, ముందుగా ఆ సేఫ్ వర్డ్‌ను చెప్పమని అడగాలి. వారు సరైన పదం చెప్పలేకపోతే అది మోసపూరిత కాల్ అని గుర్తించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాస్తవాలు నిర్ధారించుకోకుండా డబ్బు పంపవద్దని ఆయన స్పష్టం చేశారు.

తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, కేవలం రూపం, స్వరం చూసి మోసపోవద్దని సజ్జనార్ హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటి డీప్‌ఫేక్ కాల్స్ చేసి డబ్బులు అడిగితే, వెంటనే మోసమని గ్రహించి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
Sajjanar
VC Sajjanar
Deepfake
Deepfake fraud
Cyber crime
AI fraud
Artificial intelligence
Safe word
Cyber crime helpline
Financial fraud

More Telugu News