Ashwini Vaishnaw: మొంథా తుపాను... కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ఆదేశాలు

Ashwini Vaishnaw issues key directives on Montha cyclone
  • దక్షిణ మధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలతో అశ్వినీ వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స్
  • తెలుగు రాష్ట్రాలు, ఒడిశాలో డివిజనల్ వార్ రూమ్‌ల ఏర్పాటుకు ఆదేశం
  • విజయవాడ, విశాఖ, గుంటూరు డివిజన్లలో సిబ్బందిని సిద్ధం చేయాలని సూచన
'మొంథా' తీవ్ర తుపాను ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత రైల్వే శాఖ అప్రమత్తమైంది. తక్షణ చర్యలు చేపట్టేందుకు వీలుగా తెలుగు రాష్ట్రాలు, ఒడిశాలో డివిజనల్‌ వార్‌ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలైన దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్ మేనేజర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రత్యేకించి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం డివిజన్ల పరిధిలో అవసరమైన యంత్రాలు, సామగ్రితో పాటు సిబ్బందిని తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. తుపాను వల్ల ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారుల నుంచి నివేదిక కోరారు.

తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణం స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తుపాను కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని కూడా ఆయన పేర్కొన్నారు.
Ashwini Vaishnaw
Montha cyclone
Indian Railways
South Central Railway
East Coast Railway
Vijayawada
Guntur
Visakhapatnam
Cyclone alert
Railway division war rooms

More Telugu News