Karimnagar school: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు!

Karimnagar School Secret Cameras Found in Girls Toilet
  • కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో దారుణం
  • బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాల గుర్తింపు
  • గమనించి తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థినులు
  • రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కరీంనగర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల బాలికల టాయిలెట్‌లో రహస్య కెమెరాలు ఉండటం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థినులే ఈ విషయాన్ని గమనించి బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

గంగాధర మండలంలోని కురిక్యాల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కొందరు బాలికలు సోమవారం తమ వాష్‌రూమ్‌లో అనుమానాస్పదంగా లైట్ వెలుగుతున్న ఓ పరికరాన్ని గుర్తించారు. అది రహస్య కెమెరా అని అనుమానించి వెంటనే తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆగ్రహంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంటనే గంగాధర ఎస్సై వంశీకృష్ణ, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌లకు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న పోలీసులు, ఆధారాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు నివేదిక పంపినట్లు ప్రిన్సిపాల్ మీడియాకు తెలిపారు. బాలికల భద్రత కోసం జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని పాఠశాలల్లో 'స్నేహిత క్లబ్స్' వంటివి ఏర్పాటు చేశారని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు.. చర్యలు శూన్యం
ఈ ఏడాది జనవరిలో బీఆర్ఎస్ మాజీ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి హాస్టల్‌లోని బాత్రూమ్‌లలో రహస్య కెమెరాలు బయటపడటంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అప్పట్లో క్యాంపస్‌ను సందర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నెరేళ్ల శారద, హాస్టల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా కాలేజీని మూసివేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని, ప్రైవేట్ కళాశాలలకు కఠిన నిబంధనలు రూపొందించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఆ కేసులో వెంటిలేటర్ అద్దాలపై దొరికిన వేలిముద్రల ఆధారంగా ఇద్దరిని అరెస్ట్ చేసినప్పటికీ, కాలేజీ యాజమాన్యంపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ కాలేజీల కోసం కొత్త నిబంధనలు కూడా రూపొందించలేదు. 
Karimnagar school
Telangana school
secret cameras
school bathroom cameras
Kurikyala school
Gangadhara mandal
girls safety
CMR Engineering College
Narella Sharada
Revanth Reddy

More Telugu News