Revanth Reddy: మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం

Revanth Reddy Government Alert on Montha Cyclone Impact in Telangana
  • అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • పలు ప్రాంతాల్లో రాగల నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • తుపాను ప్రభావం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద పడకుండా చూడాలన్న మంత్రి
మొంథా తుపాను నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ తుపాను కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మొంథా తుపాను ప్రభావంతో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ తుపాను ప్రభావం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద పడకుండా చూడాలని, రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా చూడాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించాలని, అందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలని సూచించారు.

ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. మిగిలిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఈ రోజు వరకు 22,433 మంది రైతుల నుంచి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని వెల్లడించారు.

కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలులో అవినీతి చోటు చేసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
Revanth Reddy
Montha Cyclone
Telangana rains
Uttam Kumar Reddy
Telangana government

More Telugu News