APSRTC: 6 వేల కుటుంబాలకు ఆరోగ్య భరోసా.. తిరుపతిలో ఆర్టీసీ కొత్త వైద్యశాల

Tirupati New RTC Dispensary Offers Healthcare to 6000 Families
  • తిరుపతిలో ఆర్టీసీ ఉద్యోగుల కోసం కొత్త వైద్యశాల నిర్మాణం
  • ఈ నెల‌ 30న ప్రారంభించనున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
  • దాదాపు 6 వేల ఉద్యోగుల కుటుంబాలకు అందనున్న ఉచిత వైద్యం
  • రూ.3.89 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో భవనం
  • ఉచిత పరీక్షలతో పాటు నెలకు రూ.3 లక్షల విలువైన మందుల పంపిణీ
  • పాత డిస్పెన్సరీ శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనం ఏర్పాటు
ఆర్టీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీని నిర్మించింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. ఈ నెల 30న ఈ డిస్పెన్సరీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు, ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరుకానున్నారు. ఈ కొత్త డిస్పెన్సరీ ద్వారా తిరుపతి జిల్లాలోని 11 డిపోల సిబ్బందితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు కలిపి దాదాపు 6,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

ఆధునిక వసతులతో నిర్మాణం
తిరుపతిలోని అలిపిరి డిపో సమీపంలో 1.3 ఎకరాల స్థలంలో రూ.3.89 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని జీ+3 అంతస్తుల్లో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, మొదటి అంతస్తులో డిస్పెన్సరీ, రెండు, మూడు అంతస్తుల్లో గెస్ట్‌హౌస్ ఏర్పాటు చేశారు. వృద్ధులు, రోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా లిఫ్ట్‌ను కూడా అమర్చారు. ఒకేసారి 50 మందికి పైగా కూర్చునేలా విశాలమైన వెయిటింగ్ హాల్, ఫార్మసీ, ఓపీ కేంద్రం, వైద్యుల కోసం ప్రత్యేక గదులు వంటి సకల సౌకర్యాలు కల్పించారు.

ఉచిత మందులు, వైద్య పరీక్షలు
ఇప్పటికే ఉన్న డిస్పెన్సరీ ద్వారా రోజుకు సుమారు 100 మందికి ఈసీజీతో పాటు, సెమీ ఆటోమోటివ్‌ ఎనలైజర్‌ ద్వారా 30 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. దీనితో పాటు నెలకు సుమారు రూ.3 లక్షల విలువైన మందులను ఉచితంగా అందిస్తున్నారు. ఈ సేవలన్నీ ఇకపై కొత్త డిస్పెన్సరీలో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. కాగా, ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల ప్రమోషన్ల అంశంపై కూడా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
APSRTC
Ramprasad Reddy
Tirupati
APSRTC dispensary
Konakalla Narayana Rao
Dwaraka Tirumala Rao
RTC employees
Andhra Pradesh transport
healthcare
Chittoor district

More Telugu News