Brain Degeneration: మగువల కన్నా మగవాళ్లలోనే వేగంగా మెదడు క్షీణత

Brain Degeneration Faster in Men Than Women Study Finds
  • యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో పరిశోధనలో వెలుగులోకి..
  • అల్జీమర్స్ ముప్పు మాత్రం మహిళల్లోనే అధికమంటున్న రీసెర్చర్లు
  • దాదాపు 5 వేల మంది వాలంటీర్లు, 12 వేల ఎంఆర్ఐ స్కానింగ్ ల అధ్యయనంలో వెల్లడి
వృద్ధుల్లో మతిమరుపు సమస్య సాధారణమే.. వయసు పైబడిన కొద్దీ మెదడులోని కణజాలం నశించిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీని వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదురవుతుంటాయి. అల్జీమర్స్, డిమెన్షియా వంటి వివిధ రకాల సమస్యలు చుట్టుముడతాయి. వృద్ధాప్యంలో మెదడు క్షీణిస్తుందని పరిశోధకులు గతంలోనే గుర్తించారు. అయితే, తాజా పరిశోధనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వృద్ధుల్లో మెదడు క్షీణత అనేది మహిళలకంటే మగవాళ్లలోనే వేగంగా జరుగుతోందని నార్వేకు చెందిన ఓస్లో యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయనం వివరాలను ‘పీఎన్ఏఎస్’ జర్నల్ ఇటీవల ప్రచురించింది.

పరిశోధన సాగిందిలా..
17 సంవత్సరాల నుంచి 95 సంవత్సరాల వయసున్న 4,726 మంది వాలంటీర్లను ఈ పరిశోధన కోసం ఎంచుకున్నట్లు ఓస్లో యూనివర్సిటీ పరిశోధకుడు ఆన్నే రవాండల్ తెలిపారు. మూడేండ్ల వ్యవధితో ప్రతీ ఒక్కరికీ రెండు సార్లు ఎంఆర్ఐ స్కాన్ లు చేయించామన్నారు. మొత్తంగా 12 వేల బ్రెయిన్ స్కాన్ లు తీసి వాటన్నింటినీ విశ్లేషించినట్లు తెలిపారు. ఇందులో మహిళల్లో కన్నా పురుషుల్లోనే మెదడు క్షీణత వేగంగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. పురుషుల మెదడులోనే కణజాలం వేగంగా క్షీణిస్తోందని వెల్లడైందని రవాండల్ వివరించారు.

మహిళల్లోనే అల్జీమర్స్ బాధితులు ఎక్కువ
వయసు పెరుగుతున్న కొద్దీ మనుషుల మెదడు వేగంగా క్షీణిస్తుంది.. ఇది పురుషుల్లోనే ఎక్కువని తాజాగా తేలింది. అయితే, మెదడు క్షీణత తక్కువగా ఉన్నప్పటికీ మహిళల్లోనే అల్జీమర్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తమ పరిశోధనలో వెల్లడైందని రవాండల్ తెలిపారు. ఇది తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. మనుషుల మెదడు క్షీణతపై లింగ ప్రభావం ఉంటుందనే దానిపై ఇప్పటివరకూ పెద్దగా సమాచారం లేదని ఆయన తెలిపారు. అయితే, మెదడు క్షీణతపై లింగ ప్రభావం అంశంపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని రవాండల్ అభిప్రాయపడ్డారు.
Brain Degeneration
Men Brain Health
Women Brain Health
Alzheimers
Dementia
Oslo University
Anne Ravaandal
Brain Scan
Aging Brain
Memory Loss

More Telugu News