Gautam Gambhir: రో-కో జోడీ అద్భుతం.. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్, కోహ్లీలను మెచ్చుకున్న గంభీర్

Gautam Gambhir Lauds Rohit and Kohli Partnership
  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో చెలరేగిన రోహిత్, కోహ్లీ
  • రెండో వికెట్‌కు 168 పరుగుల అజేయ భాగస్వామ్యం
  • ఓపెనర్లు గిల్, రోహిత్ భాగస్వామ్యం చాలా కీలకమన్న గంభీర్
  • రో-కో భాగస్వామ్యం అద్భుతమంటూ ప్రశంసలు
  • మ్యాచ్‌ను ముగించిన తీరును ప్రత్యేకంగా మెచ్చుకున్న హెడ్ కోచ్
భారత క్రికెట్ జట్టు స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మళ్లీ తమ పాత రోజులను గుర్తు చేశారు. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన మూడో వన్డేలో ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 168 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. ఈ 'రో-కో' క్లాసిక్ ప్రదర్శనతో, వారిద్దరి జట్టులో స్థానంపై కొంతకాలంగా వస్తున్న విమర్శలకు కూడా తెరపడింది.

మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లతో మాట్లాడిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బ్యాటింగ్ యూనిట్‌కు కీలక సందేశాలు ఇచ్చాడు. ముఖ్యంగా రోహిత్-కోహ్లీ భాగస్వామ్యంపై ప్రశంసలు కురిపించారు. అంతకుముందు 237 పరుగుల ఛేదనలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ నెలకొల్పిన 69 పరుగుల భాగస్వామ్యం చాలా కీలకమని గంభీర్ పేర్కొన్నాడు.

"బ్యాటింగ్‌లో శుభ్‌మన్-రోహిత్ మధ్య భాగస్వామ్యం చాలా చాలా ముఖ్యం. ఆ తర్వాత రోహిత్-విరాట్ భాగస్వామ్యం కూడా అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ మరో సెంచరీ చేయడం విశేషం. దాన్ని ప్రత్యేకంగా అభినందించాలి" అని గంభీర్ అన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో గంభీర్ వెల్లడించాడు.

రోహిత్, కోహ్లీ ఇద్దరూ అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించడం పట్ల గంభీర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. "అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరిద్దరూ మ్యాచ్‌ను పూర్తి చేశారు. జట్టు కోణం నుంచి ఇది చాలా అవసరం. ఇలాంటి ఛేదనల్లో మనం ఎంత పక్కాగా ఉండగలమో ఇది చూపిస్తుంది. ఈ విషయంలో మనం చాలా బాగా ఆడాం" అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ మాట్లాడుతూ, బహుశా తమకు ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావొచ్చని తెలిపాడు. ప్రస్తుతం తమ అంతర్జాతీయ కెరీర్ చివరి దశలో ఉన్న ఈ ఇద్దరు వెటరన్లు.. త్వరలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న సిరీస్‌పై దృష్టి పెట్టనున్నారు. ఆస్ట్రేలియాలో సాధించిన మ్యాచ్ ఫిట్‌నెస్‌ను కొనసాగించడం వారి ముందున్న లక్ష్యం.
Gautam Gambhir
Rohit Sharma
Virat Kohli
India vs Australia
India Cricket
Cricket Team
ODI
Century
Partnership
Batting

More Telugu News