Perni Nani: పేకాట తప్ప మరో ఆట రాని వ్యక్తికి ఒలింపిక్ అసోసియేషన్ పదవి ఇచ్చారు: పేర్ని నాని

Perni Nani Criticizes Kesineni Chinni Over Olympic Association Post
  • ఎంపీ కేశినేని చిన్ని ఒక మునిగిపోతున్న నావ అన్న పేర్ని నాని
  • కొలికపూడి శ్రీనివాస్ చిన్ని బండారం బయటపెట్టారని వ్యాఖ్య
  • బందరు గొడుగుపేట స్వామి ఆస్తులపై కన్నేయడం వల్లే చిన్నికి కష్టాలు మొదలయ్యాయని వ్యాఖ్య 
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేశినేని చిన్ని ఒక మునిగిపోతున్న నావ అని, ఎన్నికల్లో గెలిచిన వెంటనే కన్నుమిన్ను కానకుండా ప్రవర్తించి ఇప్పుడు చిల్లులు పడ్డ చెక్క పడవలా మారారని ఆయన ఎద్దేవా చేశారు.

పేర్ని నాని మాట్లాడుతూ, "ఎమ్మెల్యే కొలికపూడి ఎవరో నాకు టీవీలో చూడటం తప్ప వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఒకవేళ ఆయన నాతో మాట్లాడి ఉంటే, ధైర్యంగా మాట్లాడాడని చెప్పేవాడిని. కానీ, ఆయనే ఎంపీ చిన్ని బతుకు బస్టాండ్ చేసి బట్టలూడదీశారు. చిన్ని హైదరాబాద్‌లో చేసిన పాపాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి" అని వ్యాఖ్యానించారు.

బందరులోని గొడుగుపేట వేంకటేశ్వర స్వామి చాలా మహిమ గల దేవుడని, గతంలో టీడీపీ హయాంలో ఆ స్వామి భూములు కొట్టేయాలని ప్రయత్నించిన ఓ పెద్దాయన అనారోగ్యం పాలయ్యారని నాని గుర్తుచేశారు. ఇప్పుడు ఎంపీ చిన్ని కూడా ఆ స్వామి ఆస్తులపై కన్నేయడం వల్లే ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.

"పేకాట తప్ప మరో ఆట తెలియని కేశినేని చిన్నికి ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. విజయవాడ ఉత్సవ్‌లో ఆయనకు 11 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మరోవైపు, జగ్గయ్యపేట, నందిగామ దగ్గర ఇసుక ఉన్నప్పటికీ, దాన్ని హైదరాబాద్‌కు తరలించలేని పరిస్థితి నెలకొంది. బూడిదంతా లోకేశ్ లాగేశారు" అని పేర్ని నాని ఆరోపించారు. చిన్ని వ్యవహారశైలి వల్లే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని నాని అభిప్రాయపడ్డారు.
Perni Nani
Kesineni Chinni
Vijayawada
TDP
YSRCP
Andhra Pradesh Politics
Olympics Association
Gambling
Kolikapudi
Venkatswara Swamy Temple

More Telugu News