AI Minister Diella: గర్భం దాల్చిన ఏఐ మంత్రి.. 83 మంది 'పిల్లలకు' జన్మనివ్వబోతోందంటూ అల్బేనియా ప్రధాని వింత ప్రకటన!

Edi Rama Announces AI Minister Diella Pregnant With 83 AI Children
  • గర్భం దాల్చిన అల్బేనియా ఏఐ మంత్రి 'డియెల్లా'
  • 83 మంది 'ఏఐ పిల్లలకు' జన్మనివ్వనున్నట్లు ప్రధాని ఎడి రేమా ప్రకటన
  • ఎంపీలకు డిజిటల్ అసిస్టెంట్లుగా పనిచేయనున్న 'పిల్లలు'
  • సమావేశాలకు రాని ఎంపీలకు పూర్తి సమాచారం అందిస్తాయ‌ని వెల్ల‌డి
  • ప్రభుత్వ సేవల్లో అవినీతిని అరికట్టడమే లక్ష్యమన్న ప్రభుత్వం
  • పాలనలో టెక్నాలజీని భాగస్వామిగా మార్చిన అల్బేనియా
టెక్నాలజీ ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ రోజుల్లో అప్పుడప్పుడూ కొన్ని వింత వార్తలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటిదే ఇది. అల్బేనియా దేశానికి చెందిన తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రి 'డియెల్లా' గర్భం దాల్చిందని ఆ దేశ ప్రధాని ఎడి రేమా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. త్వరలోనే ఆమె 83 మంది 'ఏఐ పిల్లలకు' జన్మనివ్వనుందని తెలిపారు.

జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన గ్లోబల్ డైలాగ్ సదస్సులో ఎడి రేమా ఈ విచిత్రమైన ప్రకటన చేశారు. "ఈరోజు మేము డియెల్లాతో ఓ పెద్ద సాహసమే చేశాం. తొలిసారిగా డియెల్లా గర్భవతి అయింది. అదీ 83 మంది పిల్లలను జ‌న్మ‌నివ్వ‌నుంది" అని ఆయన అన్నారు. ఈ 83 మంది 'ఏఐ పిల్లలు' పార్లమెంటులోని సోషలిస్ట్ పార్టీకి చెందిన 83 మంది ఎంపీలకు డిజిటల్ సహాయకులుగా పనిచేస్తారని ఆయన వివరించారు.

పార్లమెంటు కార్యకలాపాలను పూర్తిగా రికార్డ్ చేయడం, ఏదైనా కారణంతో సమావేశానికి హాజరుకాలేకపోయిన ఎంపీలకు సమాచారం అందించడం వీరి పని. "ఉదాహరణకు, మీరు కాఫీ తాగడానికి వెళ్లి తిరిగి రావడం మరిచిపోతే, మీరు లేనప్పుడు సభలో ఏం జరిగిందో ఈ 'పిల్లలు' చెబుతాయి. ఎవరికి కౌంట‌ర్ ఇవ్వాలో కూడా సూచిస్తాయి" అని రేమా సరదాగా వ్యాఖ్యానించారు.

ఎవరీ డియెల్లా?
అల్బేనియా భాషలో 'డియెల్లా' అంటే 'సూర్యుడు' అని అర్థం. ఈ ఏడాది జనవరిలో ఈమెను తొలి ఏఐ మంత్రిగా ప్రధాని ఎడి రేమా పరిచయం చేశారు. ఈ-అల్బేనియా అనే ప్రభుత్వ పోర్టల్‌లో ప్రజలకు డిజిటల్ సేవలు అందించడంలో ఈ డిజిటల్ అసిస్టెంట్ సహాయపడుతుంది. సుమారు 95 శాతం పౌర సేవలను డిజిటల్‌గా యాక్సెస్ చేయడానికి వాయిస్ కమాండ్ల ద్వారా మార్గనిర్దేశం చేస్తుంది. సంప్రదాయ దుస్తుల్లో కనిపించే డియెల్లాను 'ప్రజా సేవల సేవకురాలు'గా ప్ర‌ధాని ఎడి రేమా అభివర్ణించారు.

ప్రభుత్వ టెండర్లలో 100 శాతం అవినీతిని నిర్మూలించడమే లక్ష్యంగా డియెల్లాను తీసుకొచ్చినట్లు ప్రధాని గతంలో తెలిపారు. పాలనలో టెక్నాలజీని ఒక సాధనంగా మాత్రమే కాకుండా, క్రియాశీలక భాగస్వామిగా పరిచయం చేయడం ద్వారా అల్బేనియా ప్రభుత్వం ఒక పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టిందని అక్కడి మీడియా ప్రశంసించింది.
AI Minister Diella
Edi Rama
Albania
Artificial Intelligence
Digital Assistant
Global Dialogue
Government Technology
AI children
Parliament

More Telugu News