Kailash Vijayvargiya: ఆసీస్ మహిళా క్రికెటర్ల ఘటన.. మధ్యప్రదేశ్ మంత్రి షాకింగ్ కామెంట్స్

Kailash Vijayvargiya on harassment of Australian cricketers in Indore
  • ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల వేధింపుల ఘటన
  • విషయంపై స్పందించిన మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ
  • బయటకు వెళ్లే ముందు అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్లేయర్లకు సూచన
  • భారత్‌లో క్రికెటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంటుందని వ్యాఖ్య
  • ఇంగ్లండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ ఉదంతాన్ని గుర్తు చేసిన మంత్రి
  • ఈ ఘటనను ఆటగాళ్లు, అధికారులు గుణపాఠంగా తీసుకోవాలని హితవు
ఇండోర్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్య ప్రవర్తన ఘటనపై మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయవర్గీయ స్పందించారు. అంతర్జాతీయ క్రీడాకారులు తమ బస నుంచి బయటకు వెళ్లేటప్పుడు స్థానిక అధికారులకు, భద్రతా సిబ్బందికి తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. 

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ కోసం ఇండోర్ వచ్చిన ఆసీస్ ప్లేయర్లు ఇద్దరు గురువారం ఉదయం ఓ కేఫ్‌కు వెళ్లేందుకు నడుచుకుంటూ బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఖజ్రానా రోడ్డులో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి వారిని వెంబడించి, ఒకరిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత నిన్న మంత్రి మీడియాతో మాట్లాడారు.

"భారత్‌లో క్రికెటర్లకు విపరీతమైన క్రేజ్ ఉంది. వారు తమ బస నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి. తమ భద్రతా సిబ్బందికి, స్థానిక యంత్రాంగానికి సమాచారం ఇవ్వడం ముఖ్యం" అని విజయవర్గీయ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక పాత సంఘటనను గుర్తుచేసుకున్నారు. గతంలో తన సమక్షంలోనే ఇంగ్లండ్‌లోని ఓ హోటల్‌లో అభిమానులు ఒక ప్రముఖ ఫుట్‌బాల్ ప్లేయర్ దుస్తులు చించేశారని చెప్పారు.

"క్రికెట్ ప్లేయర్లకు చాలా పాపులారిటీ ఉంటుంది. వారు బయట తిరిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన హితవు పలికారు. ఈ ఘటనను అధికారులు, క్రీడాకారులు ఒక గుణపాఠంగా తీసుకోవాలని, భవిష్యత్తులో మెరుగైన కమ్యూనికేషన్, భద్రతా ఏర్పాట్లు ఉండేలా చూసుకోవాలని విజయ వర్గీయ సూచించారు.
Kailash Vijayvargiya
Australia women cricketers
Indore
Madhya Pradesh minister
ICC Women's Cricket World Cup
Sexual harassment
Cricket security
Sports safety
Khajrana road
Indian cricket fans

More Telugu News