Acid Attack Delhi: ఢిల్లీలో దారుణం: కాలేజీకి వెళ్తున్న విద్యార్థినిపై యాసిడ్ దాడి

Acid Attack Delhi student attacked with acid in Ashok Vihar
  • ఢిల్లీలో 20 ఏళ్ల విద్యార్థినిపై యాసిడ్ దాడి
  • కాలేజీకి వెళ్తుండగా బైక్‌పై వచ్చి అడ్డగించిన దుండగులు
  • నెలలుగా వేధిస్తున్న జితేందర్ అనే యువకుడే ప్రధాన నిందితుడు
  • దాడిలో యువతి చేతులకు తీవ్ర గాయాలయ్యాయి
  • బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందన్న కుటుంబ సభ్యులు
రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను కొంతకాలంగా వేధిస్తున్న యువకుడిని ఎదిరించిన  20 ఏళ్ల విద్యార్థినిపై అతడు, అతడి స్నేహితులు యాసిడ్‌తో దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె చేతులకు కాలిన గాయాలయ్యాయి. వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ దాడి జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఆదివారం ఉదయం స్పెషల్ క్లాస్ కోసం కాలేజీకి నడుచుకుంటూ వెళ్తుండగా, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. బాధితురాలు నివసించే ముకుంద్‌పూర్‌కే చెందిన జితేందర్ అనే యువకుడు ప్రధాన నిందితుడని, అతడితో పాటు ఇషాన్, అర్మాన్ ఈ దాడిలో పాల్గొన్నారని నార్త్‌వెస్ట్ డీసీపీ భీషమ్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇషాన్ ఇచ్చిన బాటిల్‌ను తీసుకున్న అర్మాన్ ఆమెపై యాసిడ్ పోశాడని బాధితురాలు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆమె తన ముఖాన్ని కాపాడుకునేందుకు చేతులు అడ్డుపెట్టడంతో, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు బాధితురాలిని వెంటనే సమీపంలోని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక విచారణలో జితేందర్ గత కొన్ని నెలలుగా యువతిని వెంబడిస్తూ వేధిస్తున్నట్లు తేలింది. సుమారు నెల రోజుల క్రితం ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, తన సోదరి పరిస్థితి విషమంగా ఉందని, ఆమె శరీరంలోని పలు భాగాల్లో కాలిన గాయాలయ్యాయని బాధితురాలి సోదరుడు మీడియాకు తెలిపారు. "మా ఇంటి దగ్గరే ఉండే నిందితుడు నా సోదరిని పదేపదే వేధిస్తున్నాడు. గత నెలలో ఆమె అతడిని నిలదీసింది. మాకు న్యాయం జరగాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Acid Attack Delhi
Delhi acid attack
acid attack student
Jitender Delhi
Delhi crime
crime news
Mukundpur
Ashok Vihar
Deep Chand Bandhu Hospital

More Telugu News