PM Modi: ప్రధాని మోదీపై హత్యకు కుట్ర?.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం!

PM Modi assassination plot viral on social media
  • చైనాలో ప్రధాని మోదీపై హత్యాయత్నానికి కుట్ర జరిగిందంటూ కథనం
  • ఈ కుట్రను భారత్, రష్యా నిఘా వర్గాలు భగ్నం చేశాయని వెల్లడి
  • కుట్ర వెనుక అమెరికా హస్తం ఉన్నట్టు అనుమానాలు
  • మోదీని తన కారులో ఎక్కించుకుని పుతిన్ హెచ్చరించినట్టు ప్రచారం
  • తిరిగి వచ్చాక మోదీ చేసిన వ్యాఖ్యలతో ఊహాగానాలకు బలం
  • ఆర్గనైజర్, మాతృభూమి కథనాలతో వెలుగులోకి వచ్చిన అంశాలు
ప్రధాని నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ భారీ హత్య కుట్రను భారత, రష్యా నిఘా సంస్థలు సంయుక్తంగా అడ్డుకున్నాయని ఓ సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా అమెరికాకు చెందిన ఓ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించిన అత్యంత కీలక సమాచారంతో ఈ కుట్రను ఛేదించినట్లు తెలుస్తోంది.

మలయాళ మీడియా సంస్థ 'మాతృభూమి',  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) మౌత్ పీస్ ఆర్గనైజర్  కథనాల ప్రకారం, ఆగస్టు 31వ తేదీ రాత్రి ఢాకాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అధికారి టెరెన్స్ అర్వెల్ జాక్సన్ మృతదేహం లభ్యమైంది. బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ, అతని ప్రొఫైల్ నిఘా వర్గాలలో అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవమున్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అసాధారణం. అదే సమయంలో భారత నాయకత్వంపై దాడికి సంబంధించి నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి. దీంతో జాక్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు.

ఇదే సమయంలో చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన 'ఆరస్ లిమోసిన్' కారులోకి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇద్దరూ సుమారు 45 నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు. ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడలేవు. సంభాషణలను రికార్డ్ చేయడం గానీ, ట్రాక్ చేయడం గానీ అసాధ్యం. మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారని సమాచారం.

భారత నిఘా సంస్థ 'రా' (RAW), రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ 'ఎస్‌విఆర్' (SVR) కొద్దిరోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి. పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. ఆగస్టు 30 రాత్రికే ముప్పును గుర్తించి, నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను అమలు కాకముందే నిర్వీర్యం చేశాయి. ఆ మరుసటి రోజే జాక్సన్ అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.


చైనా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత, ప్రధాని మోదీ ‘సమీకాన్‌ ఇండియా’ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలో చప్పట్లు కొడుతున్న సభికులను ఉద్దేశించి, “నేను చైనాకు వెళ్లినందుకు చప్పట్లు కొడుతున్నారా? లేక తిరిగొచ్చినందుకా?” అని నవ్వుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారని ఆ కథనం గుర్తుచేసింది. తాను ఒక పెను ప్రమాదం నుంచి బయటపడ్డాననే విషయాన్ని ప్రధాని పరోక్షంగా ఆ వ్యాఖ్యల ద్వారా చెప్పారని కథనం విశ్లేషించింది. ప్రస్తుతం ఈ అంశాలు సోషల్ మీడియాలో, పలు డిజిటల్ వేదికలపై తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానం, ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండటం వంటివి అమెరికాకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూల్చడంలో అమెరికాకు చరిత్ర ఉందని, ఈ నేపథ్యంలోనే ఈ కుట్ర జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
PM Modi
Modi Assassination Attempt
China
Shanghai Cooperation Organisation
SCO Summit
RAW
SVR
Vladimir Putin
United States

More Telugu News