Rohit Sharma: గుడ్ బై ఆస్ట్రేలియా... రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్

Rohit Sharma Emotional Comments Goodbye Australia
  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
  • రోహిత్ శర్మ అజేయ శతకం, విరాట్ కోహ్లీ అర్ధశతకం
  • మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు వస్తామో లేదోనని రోహిత్ వ్యాఖ్య
  • ఈ పర్యటనే తమకు చివరిది కావచ్చని పరోక్షంగా వెల్లడి
  • రోహిత్ వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో మొదలైన ఊహాగానాలు
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు చివరి వన్డేలో అద్భుత విజయాన్ని అందుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (121 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా, విరాట్ కోహ్లీ (74 నాటౌట్) అద్భుత అర్ధశతకంతో రాణించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆసీస్ నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. అయితే, ఈ గెలుపు ఆనందం కంటే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

ఈ పర్యటనే బహుశా తమకు ఆస్ట్రేలియాలో చివరిది కావచ్చని రోహిత్ సంకేతాలిచ్చాడు. మ్యాచ్ ముగిశాక మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, రవి శాస్త్రితో మాట్లాడుతూ, "నేనూ, విరాట్ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనకు వస్తామో లేదో తెలియదు" అంటూ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మాటలతో తనతో పాటు విరాట్ కోహ్లీ కెరీర్ ముగింపు దశలో ఉందని పరోక్షంగా సూచించాడు.

ఆస్ట్రేలియాలో ఆడటంపై రోహిత్ భావోద్వేగంగా మాట్లాడాడు. "2008లో ఇదే సిడ్నీలో హాఫ్ సెంచరీతో మ్యాచ్ గెలిపించడం నాకు మధురమైన జ్ఞాపకం. ఆస్ట్రేలియాలో ఆడటాన్ని నేను ఎంతో ఆస్వాదించాను. ఇక్కడ మాకు మంచి, చెడు జ్ఞాపకాలు రెండూ ఉన్నాయి. మా కెరీర్‌లో కొన్ని ఉత్తమ ఇన్నింగ్స్‌లు ఇక్కడే ఆడాం. మాకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా ప్రజలకు నా కృతజ్ఞతలు" అని తెలిపాడు.

రోహిత్ వ్యాఖ్యలతో ఈ దిగ్గజ ద్వయం ఆస్ట్రేలియా గడ్డపై మరోసారి బరిలోకి దిగడం కష్టమేనన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి. విరాట్ కోహ్లీ సైతం తనకు, రోహిత్‌కు మద్దతు తెలిపిన ఆస్ట్రేలియా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
Rohit Sharma
Virat Kohli
India cricket
Australia tour
cricket
Adam Gilchrist
Ravi Shastri
Sydney
Indian cricket team
cricket retirement

More Telugu News