Cyclone Montha: 'మొంథా' తుపాను ఎఫెక్ట్... కోస్తా జిల్లాల బీచ్ లలో పర్యాటకులకు ప్రవేశం నిషిద్ధం

Cyclone Montha effect no entry for tourists on coastal beaches
  • బంగాళాఖాతంలో వాయుగుండం.. తుపానుగా మారే అవకాశం
  • సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
  • సహాయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం
  • బుధవారం వరకు చేపల వేట, బోటింగ్ కార్యకలాపాలపై నిషేధం
  • కోస్తా తీరంలోని బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశం నిలిపివేత
  • ముందస్తు చర్యలపై కలెక్టర్లకు విపత్తుల సంస్థ ఆదేశాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా బలపడే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. 'మొంథా' తుపాను నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేయడంతో పాటు, కోస్తా జిల్లాలకు కీలక సూచనలు జారీ చేసింది.

ఈ మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరాలు వెల్లడించారు. సముద్రం అలజడిగా ఉండి, అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున బుధవారం వరకు నదులు, సముద్ర తీరాల్లో చేపల వేటను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. అదేవిధంగా, అన్ని రకాల బోటింగ్ కార్యకలాపాలను, బీచ్‌లకు పర్యాటకుల ప్రవేశాన్ని కూడా నిషేధించాలని కోస్తా జిల్లాల కలెక్టర్లకు సూచించారు. తుపానును ఎదుర్కొనేందుకు నిర్దేశించిన విధివిధానాలను (SOP) పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఈ వాయుగుండం పోర్ట్ బ్లెయిర్‌కు 510 కి.మీ, చెన్నైకి 890 కి.మీ, విశాఖపట్నం, కాకినాడలకు 920 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందన్నారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సహాయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను వివిధ జిల్లాల్లో సిద్ధంగా ఉంచినట్లు ప్రఖర్ జైన్ వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీచేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
Cyclone Montha
Andhra Pradesh
coastal districts
beaches
NDRF
SDRF
weather forecast
heavy rains
cyclone alert
Bay of Bengal

More Telugu News