Sajjanar: కాల్పుల్లో ఇద్దరు దొంగలకూ గాయాలయ్యాయి: సీపీ సజ్జనార్

Sajjanar Explains Chaderghat Firing Incident Details
  • హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో పోలీసుల కాల్పులు
  • సెల్‌ఫోన్ దొంగలను పట్టుకునే క్రమంలో ఘటన
  • డీసీపీ, గన్‌మ్యాన్‌పై కత్తితో దాడి చేసిన నిందితులు
  • ఆత్మరక్షణ కోసం రెండు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
  • ప్రధాన నిందితుడు ఒమర్‌పై 25 కేసులు, రౌడీషీట్ ఉన్నట్లు వెల్లడి
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్
నగరంలోని చాదర్‌ఘాట్‌ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. సెల్‌ఫోన్‌ దొంగిలించి పారిపోతున్న ఇద్దరు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వారు కత్తితో దాడికి యత్నించారు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు.

గాయపడిన దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పట్టుబడిన వారిలో ప్రధాన నిందితుడు ఒమర్‌ అని, అతనిపై నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 25 కేసులు నమోదై ఉన్నాయని సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఒమర్‌పై రౌడీషీట్ కూడా ఉందని తెలిపారు.

"నిందితుడు ఒమర్‌పై గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ ప్రయోగించాం. 2016లో కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో, 2020లో హుస్సేనీ ఆలమ్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదయ్యాయి. రెండుసార్లు ఏడాది పాటు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక కాలాపత్తర్‌ పోలీస్ స్టేషన్‌లో మరో రెండు కేసులు నమోదయ్యాయి" అని సీపీ సజ్జనార్ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Sajjanar
CV Sajjanar
Hyderabad Police
Chaderghat
Omar
Phone theft
Police Encounter
Hyderabad Crime
PD Act
Telangana Police

More Telugu News