Erriswamy: కర్నూలు బస్సు ప్రమాదంలో వీడిన మిస్టరీ

Kurnool Bus Fire Accident Bike Skid Led to Disaster
  • బైక్ వెనుక కూర్చున్న ఎర్రిస్వామి అనే యువకుడ్ని ప్రశ్నించిన పోలీసులు
  • బైక్‌ను బస్సు ఢీకొట్టలేదని తేలిన వైనం
  • ముందుగా బైక్ స్కిడ్ అయి డివైడర్‌ను ఢీకొట్టిందని నిర్ధారణ
  • కిందపడిన బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి
  • ప్రమాదంలో 19 మంది మృతి చెందినట్లు హోంమంత్రి ప్రకటన
కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. తొలుత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బైక్‌ను నేరుగా ఢీకొట్టడం వల్లే మంటలు చెలరేగాయని భావించగా, పోలీసుల దర్యాప్తులో అది తప్పని తేలింది. బైక్‌పై వెనుక కూర్చుని ప్రయాణిస్తూ స్వల్ప గాయాలతో బయటపడిన ఎర్రిస్వామిని పోలీసులు ప్రశ్నించడంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శివశంకర్, అతని స్నేహితుడు ఎర్రిస్వామి ఇద్దరూ బైక్‌పై లక్ష్మీపురం నుంచి రాత్రి 2 గంటలకు బయలుదేరారు. ఎర్రిస్వామిని ఇంటి వద్ద దించేందుకు శివశంకర్ తుగ్గలి బయల్దేరాడు. మార్గమధ్యంలో కియా షోరూం వద్ద ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకున్నారు. రోడ్డుపైకి వచ్చిన కొద్దిసేపటికే వారి బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. వేగంగా కుడివైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన ఎర్రిస్వామి, రోడ్డుపై ఎగిరిపడిన తన స్నేహితుడిని, రోడ్డు మధ్యలో ఉన్న బైక్ ను పక్కకి తీయాలని అనుకున్నాడు.

శివశంకర్‌ను రోడ్డు పక్కకు లాగేందుకు ఎర్రిస్వామి ప్రయత్నిస్తున్న సమయంలోనే, ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చింది. రోడ్డు మధ్యలో పడి ఉన్న వారి బైక్‌ను చాలాదూరం ఈడ్చుకెళ్లింది. దాంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు చెలరేగి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలోనే బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు మంటల్లో చిక్కుకోవడం చూసిన ఎర్రిస్వామి భయపడి తన స్వగ్రామం తుగ్గలి వెళ్లిపోయాడు. 

కాగా, ఈ ఘోర దుర్ఘటనలో 19 మంది ప్రయాణికులు సజీవదహనమైనట్లు రాష్ట్ర హోంమంత్రి అనిత నిన్న ప్రకటించిన విషయం విదితమే. మొదట ఇది రోడ్డు ప్రమాదంగా భావించినా, ఎర్రిస్వామి వాంగ్మూలంతో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై స్పష్టత వచ్చింది.
Erriswamy
Kurnool bus accident
Andhra Pradesh
Chinnatekur
bus fire accident
road accident investigation
private travels bus
bike accident
Shivashankar

More Telugu News