Chaitanya DCP: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం: సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డీసీపీ చైతన్య

Hyderabad DCP Sai Chaitanya fires on thieves in Chaderghat
  • హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం
  • డీసీపీపై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ
  • ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన డీసీపీ
  • దొంగలకు గాయాలు... ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్ నగరంలో కాల్పుల కలకలం రేగింది. శనివారం సాయంత్రం చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఇద్దరు సెల్ ఫోన్ దొంగలపై సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సాయి చైతన్య స్వయంగా కాల్పులు జరిపారు. తనపై కత్తితో దాడికి యత్నించడంతో ఆయన ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే, డీసీపీ సాయి చైతన్య శనివారం సాయంత్రం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం ముగించుకుని తిరిగి తన కార్యాలయానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఒకరి నుంచి సెల్‌ఫోన్ లాక్కొని పారిపోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే అప్రమత్తమైన డీసీపీ, తన గన్‌మెన్‌తో కలిసి వారిని పట్టుకునేందుకు వెంబడించారు. ఈ క్రమంలో దొంగల్లో ఒకరు డీసీపీపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. 

ఈ క్రమంలో జరిగిన తోపులాటలో డీసీపీ కిందపడిపోయారు. అనంతరం ఇద్దరు దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించగా... డీసీపీ, గన్ మెన్ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దాంతో దొంగలు గాయపడి, పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్వల్పంగా గాయపడిన డీసీసీ సాయి చైతన్యకు మలక్ పేట ఆసుపత్రిలో చికిత్స అందించారు.

పట్టుబడిన నిందితుడి నేర చరిత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విధి నిర్వహణలో డీసీపీ సాయి చైతన్య చూపిన చొరవ, ధైర్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Chaitanya DCP
Hyderabad
cell phone theft
Chaderghat
police firing
crime news
South East Zone
attack
self defense

More Telugu News