Vemula Prashanth Reddy: మంత్రుల మధ్య వాటాల గొడవలను సీఎం సెటిల్ చేస్తున్నారు: వేముల ప్రశాంత్ రెడ్డి

Vemula Prashanth Reddy alleges CM settling disputes among ministers
  • ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి పెరిగిపోయిందన్న వేముల
  • రోడ్ల టెండర్లలో రూ.8 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపణ
  • హ్యామ్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 'ఇందిరమ్మ రాజ్యం'లో రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన ఇతర నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్) పద్ధతిలో చేపడుతున్న రోడ్ల టెండర్లలో దాదాపు రూ.8 వేల కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

మంత్రుల మధ్య వాటాల కోసం గొడవలు జరుగుతున్నాయని, ఒక టెండర్ విషయంలో ఇద్దరు మంత్రులకు ముఖ్యమంత్రే స్వయంగా వాటాలు పంచి సెటిల్‌మెంట్ చేశారని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. డెక్కన్ సిమెంట్స్ కంపెనీని బెదిరించిన ఘటనలోనూ, మద్యం సీసాల హోలోగ్రాం కుంభకోణంలోనూ ముఖ్యమంత్రి పాత్ర ఉందని ఆరోపించారు. అవినీతి, ముడుపుల విషయంలో మంత్రులు రోజూ గొడవ పడుతున్నారని, దీంతో ఇందిరమ్మ రాజ్యం కుంభకోణాల నిలయంగా మారిందని విమర్శించారు.

హ్యామ్ టెండర్ల గురించి వివరిస్తూ.. "కేవలం రూ.9 వేల కోట్లతో పూర్తయ్యే పనులకు రూ.17 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. ఇందులో రూ.8 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. సీఆర్ఎఫ్ నిధుల కింద కిలోమీటర్‌కు రూ.1.75 కోట్లు ఖర్చవుతుంటే, హ్యామ్ కింద కిలోమీటర్‌కు రూ.3.30 కోట్లు ఎలా ఖర్చవుతుంది? పది రోజుల తేడాలో ఇచ్చిన రెండు జీవోలలో ఇంత తేడా ఎందుకుంది?" అని ఆయన ప్రశ్నించారు. ఈ టెండర్లు దక్కించుకున్న వారికి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లిస్తున్నారని, ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళుతుందో అందరికీ తెలుసని అన్నారు.

ఈ హ్యామ్ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, ఈ భారీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే తరచూ ఢిల్లీకి వెళుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ దోపిడీలో అధికారులు, ఇంజినీర్లు భాగస్వాములు కావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రూ.8 వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే ఈ టెండర్లపై ప్రతి వేదిక మీదా తమ గళం విప్పుతామని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 
Vemula Prashanth Reddy
Telangana Congress
Corruption allegations
HAM tenders scam
Kishan Reddy
Bandi Sanjay
Telangana BRS
Telangana politics
Telangana news
Telangana government

More Telugu News