Divya Suresh: నటి దివ్య సురేశ్‌పై హిట్ అండ్ రన్ కేసు.. బైక్‌ను ఢీకొట్టి పరారీ

Divya Suresh Hit and Run Case Filed by Bangalore Police
  • బెంగళూరులో బైక్‌ను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిన వైనం
  • ప్రమాదంలో యువతి కాలుకు తీవ్ర గాయం
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నటిని గుర్తించిన పోలీసులు
  • దివ్య కారును సీజ్ చేసిన అధికారులు
  • బిగ్‌బాస్ కన్నడ సీజన్-8 కంటెస్టెంట్‌గా పాప్యులరైన దివ్య
కన్నడ నటి, బిగ్‌బాస్ ఫేమ్ దివ్య సురేశ్‌పై బెంగళూరు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి తీవ్రంగా గాయపడగా, కారు ఆపకుండానే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బెంగళూరులోని బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఈ ఘటన జరిగింది. కిరణ్ అనే యువకుడు తన స్నేహితులైన అనుషా, అనితలతో కలిసి బైక్‌పై ఆసుపత్రికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో కుక్కలు మొరగడంతో భయపడిన కిరణ్ బైక్‌ను కొద్దిగా పక్కకు తిప్పాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన దివ్య సురేశ్ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. అనిత అనే యువతి మోకాలికి ఫ్రాక్చర్ కాగా, కిరణ్, అనుషాలకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే దివ్య సురేశ్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితులు ఆరోపించారు. దీనిపై ఈ నెల 7న బాధితుడు కిరణ్ బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. కారు నంబర్ ఆధారంగా అది నటి దివ్య సురేశ్‌కు చెందినదిగా గుర్తించారు. అనంతరం ఆమెను విచారణకు పిలిచి, కారును స్వాధీనం చేసుకున్నారు. దివ్య సురేశ్ కన్నడ బిగ్‌బాస్ సీజన్-8లో కంటెస్టెంట్‌గా పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. 
Divya Suresh
Divya Suresh hit and run
Kannada actress
Bigg Boss Kannada
Bangalore accident
Hit and run case
ব্যাঙ্গালোর
Karnataka police
Road accident India

More Telugu News