Maria Corina Machado: భారత్ ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం.. నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రశంసలు

Maria Corina Machado Praises India as Great Democracy
  • ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ ఆదర్శమని మరియా మచాడో వ్యాఖ్య
  • స్వేచ్ఛాయుత వెనిజులాలో ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇవ్వాలని ఉందని వెల్లడి
  • 2024 ఎన్నికల్లో గెలిచినా మదురో ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపణ
  • వెనిజులా పునర్నిర్మాణంలో భారత్ పాలుపంచుకోవాలని విజ్ఞప్తి
  • మహాత్మాగాంధీ అహింసా మార్గం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని వెల్లడి
ఈ ఏడాది (2025) నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడో భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ ఒక ‘గొప్ప ప్రజాస్వామ్యం’ అని, ప్రపంచంలోని అనేక దేశాలకు ‘ఒక ఉదాహరణ’ అని ఆమె కొనియాడారు. వెనిజులాలో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడిన తర్వాత భారత్‌తో అన్ని రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, భారత్ తమకు గొప్ప మిత్రదేశం కాగలదని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాలని ఆశిస్తున్నానని, స్వేచ్ఛాయుత వెనిజులాలో ఆయనకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నానని తెలిపారు.

గత 15 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న ఆమె 'టైమ్స్ నౌ' వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ ఎన్నో దేశాలకు, తరాలకు ఆదర్శంగా నిలిచింది. ఇది చాలా గొప్ప విషయం. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు, దానిని నిరంతరం బలోపేతం చేసుకోవాలి. ప్రపంచంలోని ఎన్నో దేశాలు మీ వైపు చూస్తున్నాయి’’ అని ఆమె అన్నారు. తాను భారత్‌ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తానని, తన కుమార్తె కొన్ని నెలల క్రితమే భారత్‌ను సందర్శించిందని, అక్కడి సంస్కృతిని ఎంతో ఇష్టపడిందని ఆమె చెప్పారు. మహాత్ముడి అహింసాయుత పోరాటం తనకు స్ఫూర్తినిచ్చిందని, శాంతియుతంగా ఉండటం బలహీనత కాదని గాంధీ ప్రపంచానికి చాటిచెప్పారని ఆమె పేర్కొన్నారు.

వెనిజులాలో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి మాట్లాడుతూ, 2024 జులై 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తమ కూటమి ఘన విజయం సాధించినప్పటికీ, నికోలస్ మదురో ప్రభుత్వం ఫలితాలను తారుమారు చేసిందని ఆమె ఆరోపించారు. ‘‘విపక్షాల అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నేను 93 శాతం ఓట్లతో గెలిచాను. కానీ, నియంతృత్వ ప్రభుత్వం నన్ను పోటీ చేయనీయకుండా నిషేధం విధించింది. దాంతో, ఓ దౌత్యవేత్త మా తరఫున నిలబడ్డారు. మేము 70 శాతం ఓట్లతో గెలిచాం. దీనికి సంబంధించిన 85 శాతం ఓటింగ్ పత్రాలను డిజిటలైజ్ చేసి ఆధారాలుగా సేకరించాం. మేం గెలిచిన తర్వాత చర్చల ద్వారా అధికార మార్పిడికి మదురోకు అవకాశం ఇచ్చినా ఆయన నిరాకరించారు. ఆ తర్వాత దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన అణచివేతకు పాల్పడ్డారు. వేలాది మంది అమాయకులు అదృశ్యమయ్యారు. మహిళలు, చిన్నారులపై చిత్రహింసలకు పాల్పడ్డారు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమకు ప్రధాన మిత్రుడని మచాడో అభివర్ణించారు. అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్ దేశాల మద్దతుతో ఏర్పడుతున్న అంతర్జాతీయ కూటమితో మదురో పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు. వెనిజులాలో నేరపూరిత సోషలిస్టు పాలన అంతమైన తర్వాత ఇంధనం, మౌలిక వసతులు, టెలికం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత కంపెనీలకు గొప్ప అవకాశాలు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
Maria Corina Machado
Venezuela
India democracy
Nobel Peace Prize
Narendra Modi
Venezuela election
India Venezuela relations
Latin America
Donald Trump
political crisis

More Telugu News