Satya Kumar Yadav: ఏపీ మంత్రి సత్యకుమార్‌తో ఫలించిన చర్చలు .. సమ్మె విరమించిన పీహెచ్‌సీ వైద్యులు

Satya Kumar Yadav Successful Talks End PHC Doctors Strike
  • మూడు వారాలుగా సమ్మె చేస్తున్న వైద్యులు  
  • సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారన్న వైద్యుల అసోసియేషన్  
  • మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అసోసియేషన్ నేతలు 
ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడు వారాలుగా కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల సమ్మెకు ముగింపు లభించింది. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌తో జరిగిన చర్చల అనంతరం సంఘం నాయకులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

తమ దీర్ఘకాలిక డిమాండ్ల పరిష్కారంపై మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చినందున సమ్మెను విరమించినట్లు అసోసియేషన్ నేతలు తెలిపారు. పీజీ మెడికల్‌ ఇన్‌సర్వీస్‌ కోటా కొనసాగింపు, సర్వీసు సంబంధిత సమస్యలు, పదోన్నతులు, భత్యాలు వంటి అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

చర్చల్లో మంత్రి 2025-26 విద్యా సంవత్సరంలో పీజీ ఇన్‌సర్వీస్‌ కోటా 20 శాతం, అలాగే 2026-27లో 15 శాతం కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గతంలో నిలిచిపోయిన డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాల అంశాన్ని పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అదేవిధంగా, ట్రైబల్‌ అలవెన్స్‌, టైమ్‌ బౌండ్‌ ప్రమోషన్లు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, అర్బన్‌ సర్వీస్‌ ఎలిజిబిలిటీ కాలాన్ని ఐదేళ్లకు కుదింపు, కొవిడ్‌ సమయంలో వేతనాలు అందని వారికి న్యాయం, అలాగే డిప్లొమా చేసిన వైద్యులు అదే స్పెషాల్టీలో ఉన్నత కోర్సులు (ఈఓఎల్) చేయగల అవకాశాలు వంటి అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాల్లో వైద్య సంఘాల ప్రతినిధులను కూడా భాగస్వాములుగా చేసుకుంటామని మంత్రి స్పష్టం చేసినట్లు సంఘ నాయకులు తెలిపారు.

సహచర వైద్యులతో చర్చించిన అనంతరం సమ్మెను విరమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యుల అసోసియేషన్‌ నేతలు వెల్లడించారు. తమ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చూపిన సానుకూల వైఖరికి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి గత నెల 28 నుంచి ఆందోళనలు చేపట్టిన పీహెచ్‌సీ వైద్యులు, ఈ నెల 3 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. 
Satya Kumar Yadav
AP Minister
PHC doctors strike
Andhra Pradesh
doctors strike called off
PG medical in service quota
health department
tribal allowance
time bound promotions
doctor demands

More Telugu News