HYDRA: కొండాపూర్‌లో రూ.30 కోట్ల పార్కు స్థలం కబ్జా యత్నం భగ్నం.. కాపాడిన హైడ్రా

HYDRA Foils Land Grab of Park Land Worth 30 Crore in Kondapur
  • కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో పార్కు స్థలం కబ్జా  
  • నకిలీ పత్రాలతో ప్లాట్లుగా విభజించి షెడ్లు వేసిన కబ్జాదారులు
  • సంఘం ఫిర్యాదుతో రంగంలోకి దిగి ఆక్రమణలు తొలగించిన హైడ్రా
  • భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డు ఏర్పాటు
హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన కొండాపూర్‌లో భారీ భూకబ్జా యత్నాన్ని హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అధికారులు అడ్డుకున్నారు. రాఘవేంద్ర కాలనీలో పార్కు కోసం కేటాయించిన రూ.30 కోట్ల విలువైన 2,000 చదరపు గజాల స్థలాన్ని నిన్న స్వాధీనం చేసుకున్నారు. కబ్జాదారులు నిర్మించిన అక్రమ షెడ్లను తొలగించి, భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ లేఅవుట్‌లో పార్కు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం 2,000 చదరపు గజాల స్థలాన్ని కేటాయించారు. అయితే, కొంతకాలంగా ఈ స్థలం ఖాళీగా ఉండటాన్ని గమనించిన కబ్జాదారులు దానిపై కన్నేశారు. నకిలీ బై-నంబర్లు సృష్టించి, ఆ స్థలాన్ని పది ప్లాట్లుగా విభజించారు. అంతేకాకుండా, ఆ ప్లాట్లలో తాత్కాలిక షెడ్లు కూడా నిర్మించారు.

ఈ వ్యవహారంపై రాఘవేంద్ర కాలనీ సీ-బ్లాక్ వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ‘ప్రజావాణి’లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అది పార్కు, కమ్యూనిటీ హాల్ కోసం కేటాయించిన స్థలమని నిర్ధారించుకున్న తర్వాత ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టారు.

ఆశ్చర్యకరంగా, కబ్జాదారులు ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడమే కాకుండా, భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతులు కూడా పొందారు. అయితే, ఈ వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ గతంలో జారీ చేసిన క్రమబద్ధీకరణ ఉత్తర్వులను, నిర్మాణ అనుమతులను రద్దు చేసింది. ప్రస్తుతం హైడ్రా అధికారులు ఆ స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకుని, బోర్డును ఏర్పాటు చేశారు.
HYDRA
Hyderabad
Kondapur
Land Encroachment
Real Estate
GHMC
Raghavendra Colony
Telangana
Park Land
Illegal Construction

More Telugu News