Reliance Industries: ఆ ఆంక్షలను పాటిస్తాం: రిలయన్స్ ఇండస్ట్రీస్

Reliance Industries to Comply with Russia Oil Sanctions
  • రష్యా చమురు దిగుమతులపై అమెరికా కఠిన ఆంక్షలు 
  • రష్యా కంపెనీలతో లావాదేవీలు నవంబర్ 21 నాటికి ముగించాలన్న అమెరికా
  • భారతదేశం రష్యా నుంచి రోజుకు సగటున 1.7 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి
రష్యా ముడి చమురు దిగుమతులపై అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు విధించిన ఆంక్షలను పాటిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ప్రకటించింది. రిఫైనరీ ఉత్పత్తుల దిగుమతి విషయంలో ఈయూ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని సంస్థ స్పష్టం చేసింది.

"అంతర్జాతీయ చట్టాలు, ఆంక్షల నిబంధనలు, నియంత్రణ మార్గదర్శకాలను ఎటువంటి ఉల్లంఘన లేకుండా పాటిస్తాం. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఈయూ ప్రకటించిన ఆంక్షల ప్రభావాన్ని సమీక్షిస్తున్నాం" అని రిలయన్స్ వెల్లడించింది.

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధ చర్యలకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా రష్యా చమురు దిగుమతులపై కఠిన ఆంక్షలు విధించింది. రష్యా చమురు దిగ్గజ సంస్థలు ‘రాస్‌నెఫ్ట్‌’, ‘లుకాయిల్’‌తో ఏ దేశం, కంపెనీ వ్యాపారం చేయరాదని హెచ్చరించింది. ఈ కంపెనీలతో కొనసాగుతున్న లావాదేవీలను నవంబర్ 21 నాటికి పూర్తిగా ముగించాలని అమెరికా స్పష్టం చేసింది.

భారతదేశం రష్యా నుంచి రోజుకు సగటున 1.7 మిలియన్ బ్యారెళ్ల (ఎండీబీ) ముడి చమురు దిగుమతి చేసుకుంటోంది. అందులో దాదాపు 1.2 ఎండీబీ రాస్‌నెఫ్ట్, లుకాయిల్ సంస్థల నుంచే వస్తున్నట్లు అంచనా. ఇందులో రిలయన్స్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీలు ప్రధానంగా దిగుమతులు చేస్తున్నాయి.

పాశ్చాత్య దేశాల ఆంక్షలు కఠినతరమవుతుండటంతో, భారతీయ కంపెనీలు ఇప్పుడు పశ్చిమాసియా దేశాల వైపు ముడి చమురు కొనుగోళ్లను మళ్లిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం, భవిష్యత్‌లో రష్యా చమురు దిగుమతులపై దేశీయ రిఫైనరీల వ్యూహం మారే అవకాశం ఉంది. 
Reliance Industries
Reliance Industries Russia oil imports
Russia oil sanctions
Rosneft
Lukoil
Ukraine war
India Russia oil trade
oil imports India
EU sanctions
Nayar Energy

More Telugu News