Chandrababu Naidu: తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తా... దుబాయ్ వేదికగా సీఎం చంద్రబాబు ధీమా

Chandrababu Naidu Aims to Make Telugu Community Number One Globally
  • దుబాయ్‌లో ఘనంగా తెలుగు డయాస్పోరా కార్యక్రమం
  • భారీగా తరలివచ్చిన గల్ఫ్ దేశాల ప్రవాసాంధ్రులు
  • తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుపుతామన్న చంద్రబాబు
  • గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు విశాఖకు గూగుల్ అని వెల్లడి
  • ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే లక్ష్యమని ఉద్ఘాటన 
యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, గల్ఫ్ దేశాల్లోని తెలుగు ప్రజలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. తన పర్యటనలో చివరి కార్యక్రమంగా దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఓమన్, బహ్రెయిన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు, తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సభకు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ వేమూరి రవి తదితరులు హాజరయ్యారు.

అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. "ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగే లేదు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ వన్ గా నిలబెట్టడమే నా లక్ష్యం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తెలుగువారు ఉన్నత స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని అన్నారు. 

30 ఏళ్ల క్రితం తాను ఐటీకి పునాదులు వేయడం వల్లే నేడు తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా టెక్ నిపుణులుగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల వంటి వారు తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటుతున్నారని కొనియాడారు. 2024 ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం ప్రవాసాంధ్రులు ఎంతో తపించారని, వారి మద్దతు మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని చంద్రబాబు వివరించారు. "గతంలో హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకొచ్చాను. ఇప్పుడు అదే స్ఫూర్తితో విశాఖపట్నానికి గూగుల్ తీసుకువస్తున్నాం. సుమారు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది" అని ప్రకటించారు. 

దేశంలోనే ‘క్వాంటం వ్యాలీ’ ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా చెప్పారు. "ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. ఐటీ, కమ్యూనికేషన్ల రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్నాం" అని తెలిపారు.

పాలనలో సాంకేతికతను జోడిస్తూ వాట్సప్ ద్వారా 730కి పైగా పౌర సేవలను అందిస్తున్నామని, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చంద్రబాబు వివరించారు. అబుదాబీ, దుబాయ్ నగరాలు ఆయిల్ ఎకానమీ నుంచి పర్యాటకం, నాలెడ్జి ఎకానమీ వైపు ఎలా పయనిస్తున్నాయో స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. లక్షన్నర హోటల్ రూములతో దుబాయ్ ఆతిథ్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తోందని, అదే తరహా అభివృద్ధిని ఏపీలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Naidu
Telugu diaspora
Andhra Pradesh
Dubai
UAE
AP development
Artificial Intelligence
Visakhapatnam
Google
NRI

More Telugu News