Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం... ఏపీ, తెలంగాణకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతి

Kurnool Bus Accident Two Software Engineers Dead
  • బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న అనూష రెడ్డి, ధాత్రి
  • అనూషరెడ్డి స్వగ్రామం యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు
  • ధాత్రిది బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడు గ్రామం
  • కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, వస్తకొండూరుకు చెందిన అనూష రెడ్డి, ఏపీలోని బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి ఉన్నారు. వీరు ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్నారు.

దీపావళి పండుగ సందర్భంగా అనూష రెడ్డి తన స్వగ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ధాత్రి హైదరాబాద్‌లోని తన మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుండి బెంగళూరు వెళ్లేందుకు అదే బస్సు ఎక్కి దురదృష్టవశాత్తు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ధాత్రి తల్లి వాణి, బంధువులు సంఘటన స్థలానికి బయలుదేరారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల మృతితో వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదిలా ఉండగా, ఈ ప్రమాదంలో మృతి చెందిన 19 మందిని గుర్తించారు. బస్సు ప్రమాదంలో మృతదేహాలను గుర్తించేందుకు ఫోరెన్సిక్ అధికారులు మృతుల బంధువుల నుండి డీఎన్ఏ నమూనాలను సేకరిస్తున్నారు. కర్నూలు శివారు ప్రాంతమైన చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
Kurnool Bus Accident
Anusha Reddy
Gannamneni Dhatri
Andhra Pradesh
Telangana
Software Engineers

More Telugu News