Tejashwi Yadav: మహిళలకు మరో ఆకర్షణీయమైన హామీ ఇచ్చిన తేజస్వి యాదవ్

Tejashwi Yadav Promises LPG Cylinder at Rs 500 for Women in Bihar
  • అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తేజస్వి హామీ
  • వృద్ధాప్య పెన్షన్‌ను రూ.1,500కు పెంచుతామని మరో కీలక ప్రకటన
  • మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా తేజస్వి యాదవ్ ప్రచారం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న వేళ, మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని, తాము అధికారంలోకి వస్తే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ.500కే అందిస్తామని సంచలన ప్రకటన చేశారు. దీంతో పాటు వృద్ధాప్య పెన్షన్‌ను నెలకు రూ.1,500కు పెంచుతామని హామీ ఇచ్చారు.

సిమ్రీ భక్తియార్‌పూర్‌లో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తేజస్వి యాదవ్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలు వింటుందని, రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ప్రధాని మోదీ ‘జంగల్ రాజ్’ అంటూ చేసిన ఆరోపణలకు తేజస్వి గట్టిగా బదులిచ్చారు. "నితీశ్ కుమార్ ప్రభుత్వంలో 55 కుంభకోణాలు జరిగాయని గతంలో స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. మరి వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు?" అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బీహార్‌లోని అవినీతిపరులైన నేతలను కాపాడుతోందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే నేరాల రేటు అధికంగా ఉందని ధ్వజమెత్తారు.

"నేను అర్ధ సత్యాలు, అబద్ధాలు చెప్పను. నేను చేసేదే చెబుతానని మీ అందరికీ తెలుసు. ఇండియా కూటమి ఎన్నికల్లో గెలిస్తే, తేజస్వి యాదవ్ ప్రజల ముఖ్యమంత్రి అవుతారు. బీహార్‌లో అవినీతి రహిత, సురక్షితమైన ప్రభుత్వాన్ని అందిస్తాను" అని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే తేజస్వి యాదవ్ ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, జీవికా దీదీలను పర్మినెంట్ చేసి నెలకు రూ.30,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన్ను మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో, కూటమిలో ఐక్యత నెలకొంది.

Tejashwi Yadav
Bihar elections
RJD
Mahagathbandhan
LPG gas cylinder
Old age pension
Nitish Kumar
Narendra Modi
Government jobs
Simri Bakhtiarpur

More Telugu News