Kaveri Travels: ఘోర బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన వి కావేరి ట్రావెల్స్

Kaveri Travels Closes Hyderabad Offices After Bus Accident
  • కర్నూలు వద్ద వి  కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం
  • ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం
  • బైక్ ఢీకొట్టడంతో చెలరేగిన భారీ మంటలు
  • పలువురు హైదరాబాద్ ప్రయాణికుల ఫోన్లు స్విచ్ ఆఫ్
  • ప్రమాదానికి గురైన బస్సుపై గతంలో రాష్ డ్రైవింగ్ చలాన్లు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించడంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటకు రాలేకపోయారు.

ఈ ఘోర ప్రమాదం నేపథ్యంలో వి కావేరి ట్రావెల్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని తమ కార్యాలయాలన్నింటినీ మూసివేసింది. ఘటన జరిగినప్పటి నుంచి యాజమాన్యం అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా, ప్రమాదానికి గురైన బస్సుపై గతంలో తెలంగాణలో రెండుసార్లు రాష్ డ్రైవింగ్ చలాన్లు విధించినట్లు సమాచారం.

ఈ బస్సులో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కారు. కూకట్‌పల్లి నుంచి ఏడుగురు ఎక్కగా, వారిలో హర్ష, రామిరెడ్డి, సూర్య ప్రాణాలతో బయటపడ్డారు. ధాత్రి, చందన, మంగా, అమృత్ కుమార్ అనే ప్రయాణికుల ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సూరారం నుంచి ఎక్కిన గుణ సాయి క్షేమంగా ఉన్నారు. బహదూర్‌పల్లిలో బస్సు ఎక్కిన సుబ్రహ్మణ్యం సురక్షితంగా బయటపడగా, అదే ప్రాంతానికి చెందిన ప్రశాంత్ ఫోన్ కలవడం లేదు. గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఎక్కిన సత్యనారాయణ, చింతల్‌లో ఎక్కిన వేణు గుండాల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
Kaveri Travels
Hyderabad
bus accident
Bengaluru
V Kaveri Travels
bus fire
road accident
Telangana
Kalluru

More Telugu News