Nara Lokesh: 2047 నాటికి ఏపీ గ్లోబల్ పవర్ హౌస్.. అదే మా లక్ష్యం: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Vision for AP as Global Powerhouse by 2047
  • ఆస్ట్రేలియాలో పెట్టుబడిదారుల సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
  • గత 16 నెలల్లోనే 117 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించామన్న మంత్రి
  • విశాఖలో గూగుల్ ఏఐ హబ్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్ర‌స్తావ‌న‌
  • అమరావతిలో దక్షిణాసియాలోనే తొలి క్వాంటం కంప్యూటర్ సేవలు అన్న లోకేశ్‌
  • నవంబర్‌లో జరిగే పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ (Austrade) ప్రతినిధులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని లోకేశ్‌ వివరించారు. "గత 16 నెలల కాలంలోనే రాష్ట్రానికి 117 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాం. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సమర్థవంతమైన నాయకుడి వల్లే ఇది సాధ్యమైంది" అని ఆయన పేర్కొన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఫార్మా, టూరిజం వంటి అనేక కీలక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0'తో పాటు 24 థీమెటిక్ పాలసీలు పారిశ్రామిక ప్రగతికి మూలస్తంభాలుగా నిలుస్తున్నాయని లోకేశ్‌ అన్నారు. ముఖ్యంగా ఏఐ, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్ వంటి అధునాతన టెక్నాలజీ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు. రాష్ట్రంలోని 6 పోర్టుల ద్వారా ప్రస్తుతం ఏటా 193 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరుగుతోందని, వచ్చే ఏడాది మరో 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. తద్వారా పోర్టుల సామర్థ్యం 350 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని వివరించారు.

విశాఖ అభివృద్ధి విజన్
విశాఖపట్నం ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని మంత్రి లోకేశ్‌ తెలిపారు. "విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ హబ్ నిర్మిస్తోంది. అదేవిధంగా, ఆర్సెలర్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. 2047 నాటికి విశాఖను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అమరావతిలో టెక్ విప్లవం
రాజధాని అమరావతిలో వచ్చే జనవరి నుంచి దక్షిణాసియాలోనే తొలి 156-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ సేవలను ప్రారంభించబోతున్నామని లోకేశ్‌ ప్రకటించారు. ఇది భారత టెక్నాలజీ రంగంలో ఒక గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ప్రణాళిక అని వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న 'పార్టనర్‌షిప్ సమ్మిట్ - 2025'కు హాజరై ఏపీలోని పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలను లోకేశ్‌ ఆహ్వానించారు.

.
Nara Lokesh
AP Global Powerhouse
Andhra Pradesh
Investment
Visakhapatnam
Amaravati
Industrial Development
Partnership Summit 2025
Austrade
IT Sector

More Telugu News