Bank Nomination Rules: నవంబర్ 1 నుంచి కొత్త నామినేషన్ రూల్స్.. మారనున్న బ్యాంకు నిబంధనలు ఇవే!

Bank Nomination Rules New Rules From November 1
  • నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త బ్యాంకింగ్ నామినేషన్ నిబంధనలు
  • ఖాతాదారులు నలుగురి వరకు నామినీలను నియమించుకునే అవకాశం
  • డిపాజిట్లకు ఏకకాలంలో లేదా ఒకరి తర్వాత ఒకరిగా నామినేషన్ సౌకర్యం
  • సేఫ్టీ లాకర్లకు మాత్రం ఒకరి తర్వాత ఒకరు పద్ధతిలోనే నామినేషన్
  • నామినీలకు ఎంత వాటా ఇవ్వాలో కూడా నిర్ణయించుకునే వెసులుబాటు
బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డిపాజిట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లకు సంబంధించిన నామినేషన్ సౌకర్యాలలో కీలక మార్పులు తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం, ఖాతాదారులు ఇకపై ఒకరికి బదులుగా గరిష్ఠంగా నలుగురిని నామినీలుగా నియమించుకోవచ్చు. ఈ కొత్త విధానం నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

బ్యాంకింగ్ చట్టాల (సవరణ) చట్టం 2025లో భాగంగా ఈ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం బ్యాంకు డిపాజిట్లకు నామినీలను రెండు విధాలుగా నియమించుకునే అవకాశం కల్పించారు. ఖాతాదారులు తమకు నచ్చిన విధంగా నలుగురు నామినీలకు ఒకేసారి లేదా ఒకరి తర్వాత మరొకరికి ప్రయోజనం అందేలా ఎంచుకోవచ్చు. అయితే, బ్యాంకుల్లోని సేఫ్ కస్టడీ వస్తువులకు, సేఫ్టీ లాకర్లకు మాత్రం ఒకరి తర్వాత మరొకరు అనే పద్ధతిలోనే నామినేషన్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది.

ఈ కొత్త విధానంలో మరో ముఖ్యమైన సౌలభ్యం కూడా ఉంది. నలుగురు నామినీలను ఎంచుకున్నప్పుడు, ఎవరికి ఎంత వాటా (శాతం) చెందాలో కూడా ఖాతాదారులే ముందుగా నిర్దేశించవచ్చు. అయితే, మొత్తం వాటాలన్నీ కలిపి 100 శాతానికి సమానంగా ఉండాలి. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో క్లెయిమ్ సెటిల్‌మెంట్లు చాలా సులభంగా, పారదర్శకంగా పూర్తవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటం, కస్టమర్లకు సౌకర్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

బ్యాంకింగ్ చట్టాల సవరణ చట్టంలోని సెక్షన్లు 10, 11, 12, 13.. నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ నిబంధనలను అన్ని బ్యాంకుల్లో ఒకే విధంగా అమలు చేయడానికి అవసరమైన 'బ్యాంకింగ్ కంపెనీల (నామినేషన్) నిబంధనలు-2025'ను, సంబంధిత ఫారాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Bank Nomination Rules
Bank deposit nomination
Safety locker nomination
New banking rules
Financial Ministry
Banking Laws Amendment Act 2025
Nominee share percentage
Claim settlements

More Telugu News