Chiranjeevi: 'చిరు' పేరు, బొమ్మతో వ్యాపారం కుదరదు.. మెగాస్టార్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు

Chiranjeevi Wins Court Order Against Unauthorized Commercial Use
  • మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట
  • అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు వాడొద్దని ఆదేశం
  • వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగంపై తాత్కాలిక నిషేధం
  • వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన చిరు 
  • ఆన్‌లైన్ సంస్థలు, యూట్యూబ్ ఛానెళ్లకు కోర్టు నోటీసులు
టాలీవుడ్ సీనియ‌ర్‌ నటుడు, మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కీలక విజయం లభించింది. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం తన పేరు, ఫొటోలు, బిరుదులను వాడుకోవడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన వ్యక్తిత్వ, ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ జడ్జి ఎస్. శశిధర్ రెడ్డి ఈ ఆదేశాలు ఇచ్చారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం, ఆన్‌లైన్ దుస్తుల సంస్థలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి పేరు, 'మెగాస్టార్', 'చిరు' వంటి బిరుదులు, ఆయన ఫొటోలు, వాయిస్‌ను వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదు. కొంతకాలంగా పలు సంస్థలు తన అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్నాయని చిరంజీవి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల తన ప్రతిష్ఠకు భంగం కలగడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టం వాటిల్లుతోందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

చిరంజీవి వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, ఈ అనధికారిక వినియోగం వల్ల ఆయన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తక్షణమే ఈ ఉల్లంఘనలను ఆపాలని ఆదేశిస్తూ తాత్కాలిక నిషేధాన్ని మంజూరు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల‌ 27వ తేదీకి వాయిదా వేసింది.

ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, నాగార్జున వంటి అగ్ర తారలు కూడా తమ పేరు, ఫొటోల వాడకంపై ఇలాంటి ఉత్తర్వులనే పొందారు.
Chiranjeevi
Megastar Chiranjeevi
Chiru
Hyderabad City Civil Court
personality rights
image rights
celebrity rights
Tollywood
court order

More Telugu News