Nara Lokesh: లోకేశ్ ఎదుట జగన్ పాలనపై ఎన్ఆర్ఐ ఆవేదన.. నాన్నను కూడా కోల్పోయానంటూ కన్నీరు

NRI expresses anguish over Jagans rule to Nara Lokesh
  • ఆస్ట్రేలియాలో మంత్రి లోకేశ్ ఎదుట ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్త ఆవేదన
  • జగన్ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయామన్న శ్రావణ్‌కుమార్
  • భూములు లాక్కొని, అక్రమ కేసులు పెట్టారని ఆరోపణ
  • వేధింపుల కారణంగా తన తండ్రిని కోల్పోయానని ఆవేదన
  • ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తామన్న లోకేశ్
  • విశాఖ సదస్సుకు రావాలని పెట్టుబడిదారులకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. బ్రిస్బేన్‌లో బుధవారం జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొన్న తీవ్ర వేధింపులను శ్రావణ్‌కుమార్ అనే పారిశ్రామికవేత్త ఏకరువు పెట్టారు. మంత్రి ఎదుటే తన ఆవేదన వెళ్లగక్కుతూ, గత పాలకులు తమను అన్ని విధాలుగా హింసించారని వాపోయారు.

గత ప్రభుత్వ హయాంలో తమ భూములను అక్రమంగా లాక్కున్నారని, న్యాయపరమైన చిక్కులు సృష్టించి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. కేవలం ఆర్థికంగానే కాకుండా, రాజకీయంగా కూడా తమపై దాడులు చేశారని తెలిపారు. ఈ వేధింపుల ఒత్తిడిని తట్టుకోలేక తన తండ్రి ప్రాణాలు కోల్పోయారని చెబుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి భయానక పరిస్థితులు ఎదుర్కొన్న తాము, మళ్లీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం సాధ్యమేనా? అని మంత్రిని సూటిగా ప్రశ్నించారు.

శ్రావణ్‌కుమార్ ఆవేదనపై స్పందించిన మంత్రి లోకేశ్, ఆయనకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలన సాగించడం వల్లే, గత ఎన్నికల్లో ప్రజలు 94 శాతం స్ట్రయిక్ రేట్‌తో టీడీపీ కూటమికి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని గుర్తుచేశారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారాయని, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పెట్టుబడులకు ఏపీ ఇప్పుడు స్వర్గధామమని, నిర్భయంగా ముందుకు రావచ్చని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌తో పాటు ఇతర పెట్టుబడిదారులను త్వరలో జరగనున్న విశాఖ భాగస్వామ్య సదస్సుకు లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు.
Nara Lokesh
Andhra Pradesh
YS Jagan
NRI
Investments
Australia
Visakha Summit
Political Harassment
Sravan Kumar
TDP

More Telugu News