: వివేకా కేసులో మరో కీలక మలుపు.. హైదరాబాద్ కోర్టులో సునీతారెడ్డి పిటిషన్

  • వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టును ఆశ్రయించిన కుమార్తె సునీత
  • మరింత లోతుగా దర్యాప్తు జరపాలని అభ్యర్థిస్తూ పిటిషన్ దాఖలు
  • సుప్రీంకోర్టు సూచనల మేరకే ట్రయల్ కోర్టులో పిటిషన్
  • అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని ఆందోళన
  • సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్‌లో ఆరోపణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ ఎన్. సునీతారెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదుపరి దర్యాప్తు కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల సూచించిన నేపథ్యంలో, ఆమె ఈ పిటిషన్‌ను దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ కేసులో దర్యాప్తును కేవలం కొందరికే పరిమితం చేస్తే అసలైన సూత్రధారులు తప్పించుకునే ప్రమాదం ఉందని, ఇప్పటికే తండ్రిని కోల్పోయి తీవ్ర వేదనలో ఉన్న తనకు అన్యాయం జరగకూడదని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని స్వయంగా సీబీఐ, ఏపీ పోలీసులే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారని ఆమె గుర్తుచేశారు.

ఈ కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి, కడప జైలులో అప్రూవర్‌గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరితో భేటీ అయి, ఆయన్ను ప్రలోభపెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని సునీత ఆరోపించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోర్టుకు విన్నవించారు.

అంతేకాకుండా, వివేకా వద్ద పీఏగా పనిచేసిన ఎంవీ కృష్ణారెడ్డి, తొలుత ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత తనపైన, తన భర్త రాజశేఖర్ రెడ్డిపైన, అప్పటి సీబీఐ దర్యాప్తు అధికారి రాంసింగ్‌పైన తప్పుడు కేసు పెట్టారని సునీత పేర్కొన్నారు. అయితే ఏపీ పోలీసులే విచారణ జరిపి అది అసత్య కేసని తేల్చి తుది నివేదిక ఇచ్చారని ఆమె తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, కేసును లోతుగా దర్యాప్తు చేసి సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.

More Telugu News