Pak-Ind: ఉగ్రవాదులు స్వాతంత్ర్య యోధులా?.. ఐరాసలో పాక్‌పై భారత్ ఫైర్

India slams Pakistan at UN for supporting terrorists
  • ఐరాసలో మరోసారి పాకిస్థాన్ వక్రబుద్ధి
  • ఉగ్రవాదులను స్వాతంత్ర్య యోధులుగా అభివర్ణన
  • పాక్ ద్వంద్వ నీతిని తీవ్రంగా ఖండించిన భారత్
  • ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర స్థానం అని స్పష్టీకరణ
  • అంతర్జాతీయ చట్టాలను తప్పుగా చూపిన పాక్‌కు ఇండియా గట్టి కౌంటర్
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను 'స్వాతంత్ర్య యోధులు'గా చిత్రీకరించి, వారి చర్యలను సమర్థించేందుకు విఫలయత్నం చేసింది. అయితే, పాకిస్థాన్ కుటిల ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది. ప్రపంచ ఉగ్రవాదానికి పాకిస్థానే కేంద్ర స్థానమని, దాని ద్వంద్వ నీతి, కపట వైఖరి మరోసారి బట్టబయలయ్యాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) వేదికగా గట్టిగా నిలదీసింది.

ఐరాస సాధారణ సభలోని మూడో కమిటీ బుధవారం ఉగ్రవాద నిరోధక చర్యలపై చర్చ నిర్వహించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రతినిధి ముహమ్మద్ జావేద్ అజ్మల్ మాట్లాడుతూ, విదేశీ ఆక్రమణను ఎదిరించే ప్రజల హక్కును, ఉగ్రవాదాన్ని వేరుగా చూడాలని వాదించారు. అంతర్జాతీయ చట్టాలు, ఐరాస తీర్మానం 46/51 కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తప్పుడు వాదనలు వినిపించారు.

పాకిస్థాన్ వాదనను భారత ప్రతినిధి, ఫస్ట్ సెక్రటరీ రఘూ పురి తీవ్రంగా ఖండించారు. మానవత్వానికే పెను ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని సమర్థించడం సిగ్గుచేటని అన్నారు. "ఉగ్రవాదం అనేది మానవత్వపు మూలాలపై దాడి చేసే అత్యంత ఘోరమైన నేరం. పాకిస్థాన్ ద్వంద్వ నీతి, కపటత్వం ప్రపంచానికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో ఉగ్రదాడులతో పాకిస్థాన్‌కు సంబంధాలున్నాయి. అలాంటి దేశం ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా మారింది" అని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థాన్ తప్పుగా ఉటంకించిన అంతర్జాతీయ చట్టాల గురించి వివరిస్తూ, 1994 నాటి ఐరాస ప్రకటన ప్రకారం రాజకీయ కారణాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ఎలాంటి చర్య అయినా ఉగ్రవాదమేనని, దానికి ఎలాంటి సమర్థన ఉండదని రఘూ పురి గుర్తుచేశారు. ఇస్లామోఫోబియా పేరుతో పాకిస్థాన్ తన ఘోరాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని, ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న పాకిస్థానే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.

దాదాపు 19 ఏళ్లుగా ఉగ్రవాదంపై ఒక స్పష్టమైన నిర్వచనం రాకుండా పాకిస్థాన్ వంటి కొన్ని దేశాలు "స్వాతంత్ర్య యోధులు" అనే ముసుగులో అడ్డుపడుతున్నాయని భారత్ ఈ సందర్భంగా గుర్తుచేసింది.
Pak-Ind
Pakistan
India UN
terrorism
Raghupuri
Muhammad Javeed Ajmal
United Nations
UNGA
counter terrorism
human rights violations
Islamophobia

More Telugu News