Nara Lokesh: ఏపీ-ఆస్ట్రేలియా వాణిజ్య బంధం బలోపేతం దిశగా లోకేశ్‌ పర్యటన

Nara Lokesh tour strengthens AP Australia trade relations
  • బ్రిస్బేన్‌లో పర్యటించిన ఏపీ మంత్రి నారా లోకేశ్
  • పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు
  • కేవలం 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి ఆకర్షించామన్న లోకేశ్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నిన్న పలు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. బ్రిస్బేన్‌లో జరిగిన బిజినెస్ రౌండ్‌టేబుల్, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లతో భేటీల్లో పాల్గొన్న లోకేశ్.. ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య, విద్యా, సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

'భాగస్వామ్య సదస్సు' నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరుగనుందని, ఆ కార్యక్రమానికి పలు ఆస్ట్రేలియా సంస్థల ప్రతినిధులను ఆహ్వానించినట్లు తెలిపారు. భారత్ నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతి అయ్యే పెట్రోలియం ఉత్పత్తులు, ఔషధాలు, ఇంజినీరింగ్ వస్తువులు, వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

'కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలతో కేవలం 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్‌కు ఆకర్షించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలు ప్రపంచ ప్రమాణాల్లో ఉన్నాయని పారిశ్రామికవేత్తలు తెలుసుకోవాలి' అని లోకేశ్ అన్నారు.

ఆక్వాకల్చర్ రంగానికి జెనెటిక్ టూల్స్ అవసరం

బ్రిస్బేన్‌లోని జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో భేటీలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో రొయ్యలు, చేపల పెంపక సామర్థ్యాన్ని పెంచేందుకు సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ట్రాపికల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ (CSTFA) సహకారం కోరారు. బ్లాక్‌టైగర్, బారాముండి రకాల రొయ్యల జన్యుపరమైన అభివృద్ధిపై పరిశోధనల్లో నైపుణ్యం కలిగిన ప్రొఫెసర్ కాల్ జెంజర్‌తో సమావేశమై, "ఆక్వాసాగులో ఆధునిక పద్ధతులు, సుస్థిర నిర్వహణ విధానాలపై ఆంధ్రప్రదేశ్ రైతులకు శిక్షణ ఇవ్వండి. ఉత్పాదకత పెంచేందుకు అభివృద్ధి చేసిన జెనెటిక్ టూల్స్‌ను ఆంధ్రప్రదేశ్‌కు అందించండి" అని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రిఫిత్ యూనివర్సిటీ హబ్ ప్రతిపాదన

గోల్డ్ కోస్ట్‌లోని గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో సమావేశమైన లోకేశ్ - పబ్లిక్ పాలసీ, స్థిరత్వం, ఇన్నోవేషన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ – గ్రిఫిత్ యూనివర్సిటీలు కలిసి పనిచేయాలని ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రిఫిత్ యూనివర్సిటీ సెంటర్/హబ్‌ను ఏర్పాటు చేసి, పరిశోధన, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలను సమన్వయం చేయాలని సూచించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి గ్రిఫిత్ యూనివర్సిటీ స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వాలని కోరారు.

విద్యారంగంలో ఏఐ సంస్కరణలు

క్వీన్స్‌ ల్యాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెంటర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. "అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో హైస్కూలు స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నాం. ఉన్నత పాఠశాలల్లో ఏఐ, స్టెమ్, రోబోటిక్స్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఏఐ యూనివర్సిటీని కూడా స్థాపించబోతున్నాం" అని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

ఈ సమావేశంలో భారత కాన్సులేట్ జనరల్ నీతూ భాగోటియా, క్వీన్స్‌ ల్యాండ్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్ ఛాన్స్‌లర్ మార్క్ హార్వే, గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషనర్ మిషెల్ మాథ్యూస్, స్టడీ క్వీన్స్‌ల్యాండ్ డైరెక్టర్ స్టెఫానీ హంటర్, జేమ్స్‌కుక్, సదరన్ క్వీన్స్‌ల్యాండ్, సీక్యూ యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొన్నారు. 
Nara Lokesh
Andhra Pradesh
Australia
AP Australia trade
AP investments
artificial intelligence
aquaculture
Griffith University
Ratan Tata Innovation Hub
Visakhapatnam

More Telugu News