Visakhapatnam: గూగుల్ కంటే ముందే.. విశాఖను గుర్తించిన అగ్రదేశాలు

Visakhapatnam Strategic Importance Before Googles Data Center Announcement
  • భారతదేశానికి కీలక వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా మారుతున్న విశాఖ
  • అణు జలాంతర్గాముల తయారీ, మరమ్మతులకు ప్రధాన కేంద్రం
  • రాంబిల్లిలో శాటిలైట్లకు కూడా చిక్కని రహస్య భూగర్భ నావికాదళ స్థావరం
  • విశాఖపై అమెరికా, చైనా వంటి దేశాల నిరంతర నిఘా
  • భోగాపురం విమానాశ్రయం తర్వాత ఐఎన్ఎస్ డేగా పూర్తిస్థాయి నావికాదళ కేంద్రంగా మార్పు
  • కొవ్వాడలో భారీ అణు విద్యుత్ కేంద్రం, ఐఎన్ఎస్ కళింగలో మిస్సైల్ పార్క్ ఏర్పాటు
గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనతో విశాఖపట్నం పేరు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, టెక్నాలజీ ప్రపంచం గుర్తించడానికి చాలా కాలం ముందు నుంచే అగ్ర దేశాలు విశాఖను ఓ కీలకమైన వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా పరిగణిస్తున్నాయి. అమెరికా, చైనా వంటి దేశాలు తమ శాటిలైట్లతో నిరంతరం ఈ నగరంపై ఓ కన్నేసి ఉంచుతున్నాయంటే ఇక్కడి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఏర్పాటు చేస్తున్న సంస్థలతో విశాఖ ఇప్పుడు భారత రక్షణ వ్యవస్థకు తూర్పు తీరంలో ఓ కంచుకోటగా మారింది.

అణు జలాంతర్గాముల తయారీ కేంద్రం
భారత నావికాదళానికి విశాఖ గుండెకాయ వంటిది. ఇక్కడి షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ) ఇప్పుడు పూర్తిగా అణు జలాంతర్గాముల నిర్మాణ కేంద్రంగా మారిపోయింది. రష్యా సహకారంతో ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహంత్, అరిఘాత్, అర్థిమాన్‌లను ఇక్కడే నిర్మించారు. ప్రస్తుతం నాలుగో అణు జలాంతర్గామి నిర్మాణంలో ఉంది. దీనికి తోడు, 'ప్రాజెక్టు-77' పేరుతో మరో ఆరు అత్యాధునిక న్యూక్లియర్ సబ్‌మెరైన్ల నిర్మాణానికి కేంద్రం ఇటీవల పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే తొలి జలాంతర్గామిని జర్మనీకి విక్రయించేందుకు దాదాపు రూ.50 వేల కోట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

రహస్య భూగర్భ స్థావరం.. 'వర్ష'
విశాఖకు సమీపంలోని రాంబిల్లిలో దాదాపు 5,000 ఎకరాల్లో 'వర్ష' పేరుతో నావికాదళం ఓ ప్రత్యామ్నాయ స్థావరాన్ని (NAOB) నిర్మిస్తోంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి నిర్మాణాలు పూర్తిగా భూగర్భంలో ఉంటాయి. ఇక్కడ డాక్ చేసిన అణు జలాంతర్గాములను శత్రు దేశాల శాటిలైట్లు కూడా గుర్తించలేవు. ఏకకాలంలో 12 న్యూక్లియర్ సబ్‌మెరైన్లను నిలిపే సామర్థ్యంతో ఈ స్థావరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అణు రియాక్టర్లను అందించేందుకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) ను కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు.

గగనతలంలోనూ పట్టు
ప్రస్తుతం నేవీ ఆధ్వర్యంలో ఉన్న విశాఖ విమానాశ్రయం, భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాగానే పూర్తిగా ఐఎన్ఎస్ డేగా అవసరాలకు కేటాయించబడుతుంది. దీంతో ఇక్కడి నుంచి మరిన్ని యుద్ధ విమానాలు కార్యకలాపాలు సాగిస్తాయి. మరోవైపు, భీమిలి సమీపంలోని ఐఎన్ఎస్ కళింగను 'అగ్నిప్రస్థ' పేరుతో మిస్సైల్ పార్క్‌గా అభివృద్ధి చేశారు. ఆకాశ్, పృథ్వీ వంటి క్షిపణులను ఇక్కడ నిల్వ ఉంచారు. నేవీకి అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసే ఎన్‌ఎస్‌టీఎల్‌ను డీఆర్‌డీఓ ఆధునికీకరిస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 'వరుణాస్త్ర' టోర్పడోను ఇక్కడే తయారుచేశారు.

ఈ పరిణామాలన్నిటినీ పర్యవేక్షించేందుకు స్వయంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత ఏడాదిలో ఆరు సార్లు విశాఖ రావడం, ప్రధాని మోదీ సైతం నేవీ ప్రాజెక్టులను సమీక్షించడం ఈ నగరం ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. కొవ్వాడలో భారీ అణు విద్యుత్ ప్లాంటు కూడా నిర్మాణంలో ఉండటంతో, విశాఖ కేవలం పారిశ్రామిక నగరంగానే కాకుండా, భారత రక్షణ రంగంలో అత్యంత కీలకమైన కేంద్రంగా రూపాంతరం చెందింది.
Visakhapatnam
Google data center
strategic defense
nuclear submarines
INS Arihant
Varsha naval base
Indian Navy
missile park
defense projects
east coast

More Telugu News